మాజీ మంత్రి వివేకా హత్య కేసు ఇపుడు ఇరు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలసిిందే. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈ రోజు రెండోసారి సీబీఐ విచారణకు హాజరు కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి వివేకా హత్య కేసు గురించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాను చంపిన 6 గంటల తర్వాత సాక్షి మీడియాలో గుండెపోటుతో చనిపోయినట్టు వార్తలు వచ్చాయని, ఆనాడు సీఎంగా ఉన్న తాను కూడా అది నిజమే అనుకొని మోసపోయానని చెప్పారు.
తనతోపాటు అందరూ వివేకా గుండెపోటుతోనే చనిపోయారనుకున్నారని, కానీ, వివేకా కూతురు సునీత మాత్రం తన తండ్రి మరణానికి గల కారణం తెలుసుకోవాలని పోస్టుమార్టం కోసం పట్టుబట్టిందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. అలా తీగ లాగితే డొంకంతా బయటపడిందని, మనిషిని అంత భయంకరంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత..తన తండ్రిమాదిరిగానే బాబాయినీ చంపేశారంటూ జగన్ ప్లేటు ఫిరాయించారని ఆరోపించాడు.
ఆ తర్వాత రోజే సిగ్గూఎగ్గూ లేకుండా తన పేపర్లో నారాసుర రక్తచరిత్ర అని రాశాడని, తన చెల్లెలు సునీతను కూడా ట్రాప్ చేశాడని దుయ్యబట్టారు. సీబీఐ ఎంక్వైరీ అంటూ డ్రామాలు ఆడి రాష్ట్రమంతా సానుభూతి సంపాదించాడని, ఎన్నికల్లో గెలిచాడని విమర్శించారు. సీఎం కాగానే సీబీఐ విచారణ వద్దన్నది కూడా జగనేనని, సునీత పట్టుబట్టడంతో సీబీఐ విచారణ, చివరకు పక్క రాష్ట్రానికి విచారణ బదిలీ జరిగే వరకు వచ్చిందని అన్నారు.
సాక్షి గుమస్తా సజ్జల ఏదైనా మాట్లాడగలడని ఎద్దేవా చేశారు. తాను సీబీఐని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేనేజ్ చేస్తున్నానని ఏది పడితే అది వాగుతుంటారని మండిపడ్డారు. ఆ తర్వాత ఆ మాటలను కొందరు వైసీపీ సైకో కార్యకర్తలు పట్టుకొని సోషల్ మీడియాలో పేటీఎమ్ బ్యాచ్ ద్వారా దుష్ప్రచారం చేస్తారని దుయ్యబట్టారు. టీవీ9, ఎన్ టీవీ బ్లూ మీడియా వీటి గురించి ఒక్క వార్త రాయరని విమర్శించారు. జగన్ కు మీడియానే లేదంట… సాక్షి ఆయనది కాదంట, ఎన్టీవీ ఆయనది కాదంట, లేకపోతే టీవీ9 ఆయనది కాదంట! అని పంచ్ లు వేశారు.
అవినాశ్ కు ఈ కేసులో ఏమాత్రం సంబంధం లేదు… అవినాశ్ రెడ్డి నోట్లో వేలు పెడితే కొరకలేడు అని అంటున్నాడని, ఓవైపు సీబీఐ విచారణ జరుగుతోందని జగన్ ను ఏకి పారేశారు. సీబీఐదే తప్పు అని సజ్జల నిస్సిగ్గుగా అంటున్నాడని, తాము నిర్దోషులం అని చెప్పుకుంటున్నాడని విమర్శించారు. ఈ హత్యకు రూ.40 కోట్ల సుపారీ ఇచ్చారు.. రూ.40 కోట్లు అవినాశ్ దగ్గర ఉన్నాయా? ఎవరి డబ్బులు ఇవి? అని ప్రశ్నించారు.