ఉమ్మడి కర్నూలు జిల్లాలోని టీడీపీ నాయకులకు పార్టీ అధినేత చంద్ర బాబు దిశానిర్దేశం చేశారు. వివాదాలతో రోడ్డున పడితే.. మీరు నేను కూడా ఇబ్బందులు పడాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడున్న పరిస్థితిలో పార్టీ అధికారంలోకి రావడం నాకన్నా.. మీకే ఎక్కువ అవసరం అనే విషయాన్ని గుర్తించండని సూచించారు. కలిసి మెలిసి పార్టీని డెవలప్ చేయాలని.. వివాదాలు ఏమైనా ఉంటే తనకు వదిలేయాలని.. విజయం బాటలో నడవాలని దిశానిర్దేశం చేశారు. ఇటీవల కర్నూలు జిల్లా టీడీపీ ఇంచార్జ్‌గా బీటీ నాయుడును చంద్రబాబు నియమించారు. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు కర్నూలు రాజకీయ పరిణామాలు.. నేతల పనితీరుపై సమీక్షించారు. అంతేకాదు.. అంతర్గత కుమ్ములాటలతో తీరిక లేకుండా ఉన్నవారి వివరాలను కూడా సేకరించారు. ఒక్కొక్క నియోజకవర్గంలో పరిస్థితిని సుదీర్గంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య వివాదం, కోట్ల-కేఈ కుటుంబాల వివాదం వంటివి ప్రధానంగా చర్చకు వచ్చాయి. వీటిపై స్పందించిన చంద్రబాబు.. “నేను అందరికీ ఒక్కటే చెబుతున్నా.. పార్టీని అందరం కలిసి అధికారంలోకి తీసుకురావల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకోండి. విజయం సాధించాలనే పట్టుదలతో పనిచేయండి“ అని సూచించారు.
అదేసమయంలో కర్నూలు పార్లమెంటు నియోజకవర్గం సహా.. ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ గెలుచుకునే స్థానికంగా కూడా వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ పార్టీకి ముఖ్యమేనని.. ఒకరిపై ప్రేమ, మరొకరిపై ద్వేషం తనకు ఉండవని.. పార్టీనే ముఖ్యమని.. నేతలు కాదని ఈ సందర్భంగా చంద్రబాబు తేల్చి చెప్పారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే.. పార్టీ తనపని తాను చేస్తుందని పరోక్షంగా వివాదాలకు దిగుతున్నవారిని ఆయన హెచ్చరించారు. ఈ సందర్బంగా బీటీ నాయుడును ఆయన అభినందించారు. వైసీపీ నేతల అవినీతి, అక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని.. పార్టీ మినీ మేనిఫెస్టోను మరింత వివరించాలని చెప్పారు.