చంద్రబాబు నాయుడు జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరిస్తూ ‘తెలుగోడు’ ప్రపంచంపై తెలుగోడి సంతకం అన్న ఉపశీర్షికతో విజయవాణి ప్రొడక్షన్స్ పతాకంపై చీలా వేణుగోపాల్ సమర్పణలో కథ, కథనం, మాటలు, స్వీయ దర్శకత్వంలో డాక్టర్ వెంకీ మేడసాని నిర్మించిన ఈ సినిమా గురువారం యూట్యూబ్ లో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో మూడు రోజులలో ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా మరింత హీట్ పుట్టిస్తున్నది.
”చంద్రబాబు జీవితంలో, ఆయన పరిపాలనలో చేపట్టిన సంస్కరణల వల్ల ప్రజల జీవితాలు మారాయి. నన్ను ఈ అంశం ఎక్కువగా ఆకర్షించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాలు గడిచినా పల్లెటూరి ప్రజల జీవితాలు మారలేదు. చంద్రబాబు చేసిన అభివృద్ధి కారణంగా నగరాలకు వచ్చిన పల్లె ప్రజలు ఉన్నతమైన జీవితం సాగిస్తున్నారు. అభివృద్ధి అంటే కేవలం భవనాలు మాత్రమే కాదు. సమాజంలో వచ్చిన మార్పు కూడా. ఎటువంటి సామజిక అసమానతలు లేకుండా అందరూ ఒక్కటిగా బతుకుతున్నారు’’ అన్న పాయింట్ మీద సినిమా తీసినట్లు దర్శకుడు వెంకీ మేడసాని వెల్లడించాడు.
”ప్రపంచానికి తెలియని ఓ ప్రాంతాన్ని ప్రపంచానికి గమ్యస్థానంగా మార్చాలని భావించిన ఓ నాయకుడి కథ మా సినిమా అని, కథ సిద్ధం చేశాక కొందరు నిర్మాతలను కలిసినా రాజకీయ నాయకుడి కథ వద్దని వారించారని, అయితే తనకు పాయింట్ నచ్చి సినిమా తీశానని, ఎక్కువ మందికి చేరాలని యూట్యూబ్ లో విడుదల చేశామని, చిన్న ఆర్టిస్టులతో పెద్ద సినిమా తీశామని’’ వెంకీ మేడసాని అన్నాడు. ఎన్నికలకు నాలుగు రోజుల ముందు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ప్రభావం చూపుతుందో వేచిచూడాలి.