టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించిన మూడు పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు రిమాండ్ రిపోర్టు, ఎఫ్ ఐఆర్ క్వాష్ చేయాలని, అమరావతి రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని, స్కిల్ స్కాం కేసులో మధ్యంత బెయిల్, చంద్రబాబు కస్టడీపై సీఐడీ వేసిన పిటిషన్లపై ఈరోజు జరగబోయే విచారణపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగు రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు ఊరటనివ్వలేదు. ఆ కేసులో ముందస్తు బెయిల్ విచారణను 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
ఇక, స్కిల్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలని దాఖలైన పిటిషన్ పై చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వర్చువల్ గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్ 17ఏకు సంబంధించి ఆర్నబ్ గోస్వామి కేసును ఉదహరించారు సాల్వే. ప్రభుత్వం కక్షపూరితంగా తమ పరిధి దాటి వ్యవహరించినపుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చని ఆయన వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతే అరెస్టు చేయాలని, అయినా 2021లో నమోదైన కేసులో ఇప్పుడు చంద్రబాబు పేరు చేర్చడం ఏమిటని వాదించారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని, అరెస్టు విషయంలో సీఐడీ ప్రొసీజర్ ఫాలో కాలేదని అన్నారు.
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రివేంజ్ రిజైమ్ గా చంద్రబాబుపై దురుద్దేశ్యంతో కేసు పెట్టారని వాదించారు. చంద్రబాబును 5 రోజుల పాటు సీఐడీ కస్టడీకి కోరగా…ఈ నెల 18 వరకు ఆగాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో, ఆ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ రోజు వాదనలు జరగబోతున్నాయి.