స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ లో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు ఈ కేసులో బెయిల్ కోసం దరఖాస్తు చేయగా ఆ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలోనే బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టు తలుపుతట్టగా ఈ వ్యవహారంపై విచారణ శుక్రవారం నాడు హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు రానుంది.
చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటిషన్ల పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. వాస్తవానికి దసరా సెలవులకు ముందు హైకోర్టులో చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది. చంద్రబాబు వయసు, అనారోగ్య కారణాల రీత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే, దసరా సెలవులు వస్తున్న నేపథ్యంలో ఈ పిటిషన్ వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు. ఈ క్రమంలోనే శుక్రవారం నాడు హైకోర్టులో సింగిల్ బెంచ్ ముందు ఎనిమిదవ నెంబర్ కేసుగా చంద్రబాబు పిటిషన్ లిస్ట్ అయింది.