ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మరోసారి ఊరటనిచ్చింది. ఆ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ ను మరో రెండు రోజుల పాటు పొడిగించింది. అక్టోబరు 18 వరకు బెయిల్ ను పొడిగించడంతో పాటు..ఆ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. అంతేకాదు, ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌పై ఈ నెల 18 వరకు వరకూ విచారణ జరపవద్దని ఆదేశించింది.
ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీఐడీ 500 పేజీల కౌంటర్ దాఖలు చేయగా…దానిని పరీశీలించేందుకు ఈ నెల18 వరకు విచారణ వాయిదా వేసింది. అంతకుముందు సోమవారం వరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పీటీ వారెంట్, పోలీస్ కస్టడీపై ఆదేశాలివ్వొద్దని ఏసీబీ కోర్టుకు హైకోర్టు సూచించింది. ఈ రోజు గడువు ముగియడంతో మరో 2 రోజుల పాటు బెయిల్ పొడిగించింది.
మరోవైపు, అమరావతి అసైన్డ్ భూముల కేసు తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో కొత్త ఆధారాలున్నాయని, కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేయడంతో తీర్పు వాయిదా పడింది. కొత్త ఆధారాలను పరిశీలించిన హైకోర్టు.. నవంబర్ 1వకి తదుపరి విచారణ వాయిదా వేసింది. కేసు రీఓపెన్ పై అభ్యంతరాలుంటే కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు కోర్టు సూచించింది.