ఏపీ సీఎంగా జగన్ పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పలుమార్లు ఏపీ డీజీపీకి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. గత ఏడాదిన్నర కాలంగా వైసీపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దారుణమైన స్థితికి చేరుకున్నాయని చంద్రబాబు ఎన్నోసార్లు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఇటు టీడీపీ నేతలు, కార్యకర్తలతో పాటు కొందరు సామాన్యులపై కూడా దాడులు పెరిగాయని చంద్రబాబు అరణ్యరోదన చేస్తున్నారు.
దోపిడిదారులు, గుండాలు, మాఫియా శక్తులు ఏపీని ఆటవిక రాజ్యంగా మార్చాయని, ఏపీలో బడుగుబలహీన వర్గాల వారిపై గంపగుత్త దాడులు, చట్ట ఉల్లంఘనల, ప్రాథమిక హక్కులను కాల రాయడం వంటివి నిత్యకృత్యమయ్యాయని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు. ఈ విషయాలపై స్పందించాలంటూ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు చంద్రబాబు పలుమార్లు లేఖలు రాసినా స్పందన రాలేదు. గతంలో డాక్టర్ సుధాకర్ ను వేధించి…చివరకు మనోవేదనతో ఆయన మరణానికి కూడా జగన్ సర్కార్ కారణమైందని ఆరోపణలు రావడం కలకలం రేపాయి.
అయినప్పటికీ, తీరు మారని జగన్ సర్కార్…ఏపీ పోలీసులు….తాజాగా ప్రైవేట్ ఆస్పత్రి ఉద్యోగి అపర్ణతో వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అపర్ణను పోలీసులు ఈడ్చుకెళ్లిన వైనం వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీలో శాంతి భద్రతలపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వారియర్లను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. సామాన్య ప్రజలను..ముఖ్యంగా దళితులను పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వంలో ఒక వర్గం పోలీసులు ప్రజాస్వామ్య ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాజ్యాంగ, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఘటనలు వలస పాలన ను గుర్తుకు తెస్తున్నాయని అన్నారు. కొందరు పోలీసులు ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నారని, విశాఖలో డాక్టర్ సుధాకర్ ఘటన మరవకముందే.. ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్న దళిత ఉద్యోగి అపర్ణను పోలీసులు అడ్డగించి వేధించారని ఆరోపించారు. తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్లిష్ట పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లౌన్ వారియర్లపై చిన్నచూపు తగదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని గవర్నర్ ను చంద్రబాబు కోరారు.