బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి గురించి ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు పరిచయం అక్కర్లేదు. గత 23 ఏళ్లుగా తెలుగు ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా ఎంతో మంది క్యాన్సర్ రోగులకు చికిత్స అందించిన ఘనత బసవతారకం ఆసుపత్రిదే. ఎప్పటికప్పుడు అత్యధిక పరికరాలతో రోగులకు చికిత్స అందిస్తూ నిరుపేదల పాలిట పెన్నిధిగా ఈ ఆసుపత్రి మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్ లో ఈ ఆసుపత్రి 23వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఆయనతోపాటు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు, మహిళా క్రికెటర్ ప్రణవి చంద్ర తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కొత్త పరికరాలను బాలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ పై బాలకృష్ణ ప్రశంసలు గెలిపించారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం అందరికీ ఆదర్శప్రాయం అని, తన మాతృమూర్తి బసవతారకం కోరిక ప్రకారం క్యాన్సర్ హాస్పిటల్ ను ఆయన ఏర్పాటు చేశారని అన్నారు. దేశంలోనే క్యాన్సర్ కు ఉత్తమ చికిత్స, సేవలు అందిస్తున్న రెండో క్యాన్సర్ ఆస్పత్రిగా బసవతారకం హాస్పిటల్ నిలిచిందని బాలకృష్ణ సగర్వంగా చెప్పారు. తమకు సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.
తాను డాక్టర్ కావాలన్నది ఎన్టీఆర్ కోరిక అని, అందుకే మెడికల్ ఎంట్రన్స్ లో సీటు రాదని తెలిసినా రాశానని బాలయ్య అన్నారు. డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని, అయినా సరే బసవతారకం హాస్పిటల్ చైర్మన్ అయ్యానని చమత్కరించారు. ఎదుటి వ్యక్తిని చూడగానే మనసు చదివేస్తానని, అందుకే తాను కూడా సైకియాట్రిస్ట్ అని జోక్ చేశారు. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని, రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం అని బాలయ్య ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనతో బ్యాడ్మింటన్ ఆడాలని పీవీ సింధుతో బాలయ్య సెటైర్లు వేశారు.