అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారిన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష నేత చంద్రబాబును వైసీపీ సభ్యులు అవమానించడంతో ఆయన సభను బాయ్ కాట్ చేయడం సంచలనం రేపింది. అంతేకాదు, మళ్లీ సభలోకి ముఖ్యమంత్రి అయ్యాకే అడుగుపెడుతానంటూ చంద్రబాబు శపథం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ తర్వాత మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు….పాత్రికేయుల సాక్షిగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాతో మాట్లాడుతూనే మధ్యలో చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు భోరున విలపిస్తూ కన్నీరు పెట్టుకోవడం టీడీపీ నేతలను, కార్యకర్తలను కలచివేసింది. గత రెండున్నరేళ్లుగా తనను అన్ని విధాలా అవమానిస్తున్నారని, బండబూతులు తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా, ప్రజల కోసం ఇవన్నీ భరించానని చెప్పారు.
కానీ, ఈ రోజు తనతోపాటు తన భార్యను రాజకీయాల్లోకి లాగుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తన భార్య వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని నిప్పులు చెరిగారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలా జరగలేదని అన్నారు. పార్టీ నేతలను దూషించడం, కార్యకర్తలను హింసించడం, బీఏసీలో అచ్చెన్నాయుడుతో జగన్ వ్యంగ్యంగా మాట్లాడడం వంటివి భరించామని అన్నారు.
కానీ, ఇవన్నీ రెండున్నరేళ్లు భరించి ప్రజల కోసం అసెంబ్లీకి వెళ్తే తన కుటుంబాన్ని కూడా అవమానిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు 151 సీట్లు వైసీపీకిచ్చి.. తమకు 23 స్థానాలిచ్చినా బాధపడలేదని, కానీ ఈ ప్రభుత్వం ప్రజల పాలిట భస్మాసుర హస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కౌరవ సభలా మారిందిని.. గౌరవం లేని సభ అని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలను ఎప్పుడూ చులకన చేసి మాట్లాడలేదని అన్నారు.