తెలుగు దేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారం రేపుతోంది. కాపు కాసి మరీ పట్టాభిపై రాడ్లతో దాడికి తెగబడడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పట్టాభిపై దాడి ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. పట్టాభి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించిన చంద్రబాబు…జగన్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓ మంత్రి, ఇంకొంత మంది రౌడీలు రెచ్చిపోతున్నారని…వైసీపీ నేతలు గూండాలుగా తయారైపోయారని మండిపడ్డారు. వారికి కళ్లు నెత్తికెక్కి ఏమైనా చేయగలమని భావిస్తున్నారని, పట్టాభిపై దాడికి సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ అవినీతిని పట్టాభి ప్రశ్నిస్తున్నారని, వైసీపీ నేతలు బరితెగించి దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పట్టాభిని చంపాలనే దాడి చేశారని, గతంలో కూడా పట్టాభిపై దాడి జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేవాలయాలపై దాడులు..టీడీపీ నేతలపై దాడులు…వీటిపై టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారని, తట్టుకోలేక జగన్ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇది పులివెందుల కాదని జగన్ గుర్తు పెట్టుకోవాని హెచ్చరించారు. ఓ వైపు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని అరెస్టు చేశాని,…. ఇక్కడ పట్టాభిపై దాడి చేశారని …ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని చంద్రబాబు అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి అంటే ఇది ప్రజలపై దాడి అని..ఎంత మందిని చంపుతారో? చంపండి చూస్తాం అని మండిపడ్డారు. మీ బూతు మంత్రులకు చెప్పుకో జగన్.. ఇటువంటివి జరుగతూ పోతే చూస్తూ ఊరుకోం.. వైసీపీ నేతలారా… ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
‘ఇటువంటివి జరిగితే చూస్తూ ఊరుకోబోము. తన హయాంలో టీడీపీ నేతలు తప్పుగా మాట్లాడితే తాను వారిని కంట్రోల్ చేసేవాడినని, జగన్ తన వారిని కంట్రోల్ లో పెట్టుకోవాలని హితువుపలికారు. డీజీపీ సరైన రీతిలో స్పందిస్తే ఇప్పుడు మళ్లీ దాడి జరిగేది కాదని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే అర్హత జగన్ కు లేదు. వెంటనే రాజీనామా చేయాలి’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలంతా జగన్ ను కలుస్తామని, మెమొరాండం ఇస్తామని…సీఎం స్పందన చూసి తదుపరి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని చంద్రబాబు చెప్పారు.