కరోనాపై పోరులో జగన్ చేతులెత్తేసిన నేపథ్యంలో వేలాది మంది కరోనాబారినపడి మరణించిన సంగతి తెలిసిందే. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొంది ఇళ్లు, ఒళ్లు గుల్ల అయిన బాధితులు లక్షల్లో ఉంటారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని కరోనా బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ‘సాధన దీక్ష’కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ దీక్షలో జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు.
జగన్ పదేపదే అబద్ధాలు చెబుతారని, ఆయన ఒక ఫేక్ సీఎం అని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రపంచానికి తలమానికంగా కరోనా వ్యాక్సిన్ రూపొందించిన భారత్ బయోటెక్‌కు కులం రంగు పూసిన నాగరికత జగన్ రెడ్డిదని చంద్రబాబు మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు చేసిన జగన్ రెడ్డికి బుద్ది ఉందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను సంక్షోభాలకు భయపడే రకం కాదని, సమాజాన్ని కాపాడడమే తన ధ్యేయం అని చంద్రబాబు స్పష్టం చేశారు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆదాయాలు కోల్పోతున్న ప్రజలకు కొనుగోలు శక్తి పెంచడం పోయి…వారి నుంచి పన్నుల రూపంలో డబ్బు గుంజుకుంటున్నారని మండిపడ్డారు.
ఇంటి పక్కన గ్యాంగ్ రేప్ జరిగితే పట్టించుకోకుండా, సాధన దీక్ష దృష్టి మళ్లించేందుకే దిశా కార్యక్రమం అంటూ జగన్ ఈరోజు హడావిడి చేస్తున్నారని విమర్శించారు. ఉన్న చట్టాలను అమలు చేసే సత్తా సీఎం జగన్‌కు ఉంటే కొత్తవి అవసరం లేదని, దిశ చట్టానికి యాప్, వాహనాలు, పోలీస్ స్టేషన్ల వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని తప్పుడు సమాచారంతో సుప్రీంకోర్టును కూడా తప్పుదోవ పట్టించాలనుకున్నారని, కోర్టు గట్టిగా హెచ్చరించడంతో జగన్ తోక జాడించారని చంద్రబాబు అన్నారు.
రైతులు, కార్మికులు, ప్రైవేటు టీచర్లతో సహా అనేక రంగాల వారు పనిలేకుండా పస్తులుంటూ నానా అవస్థలు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కాలంలోనూ జగన్ రెడ్డికి కక్షా రాజకీయాలే ముఖ్యమని, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడంపై పెట్టిన శ్రద్ధ కరోనా కట్టడిపై పెట్టలేదని దుయ్యబట్టారు. తమిళనాడులో అమ్మ క్యాoటీన్లలో జయలలిత ఫోటో పెట్టడం మంచి రాజకీయ సంస్కృతికి నిదర్శనమని కొనియాడారు.
ఏపీలో అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుపై కొట్టడం కుటిల రాజకీయ సంస్కృతికి నిదర్శనమని విమర్శించారు. అత్యాచార నిందితులను పట్టుకోని ఈ ప్రభుత్వం, ఉద్యోగాలు కావాలని కోరిన విద్యార్థులపై అత్యాచారం కేసులు పెట్టారని, తప్పుడు కేసులు పెడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ హయాంలో తాను ఇలానే తప్పుడు కేసులు పెట్టి ఉంటే వైసీపీలో ఒక్కరు కూడా రోడ్డుపైకి వచ్చే వారు కాదని చంద్రబాబు గుర్తు చేశారు.