పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్…ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తి పంపకాల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. అయితే, అన్నా చెల్లెళ్లు గొడవ పడుతూ మధ్యలో టీడీపీని లాగుతున్న వైనంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తన తల్లి, చెల్లిని కోర్టుకు ఈడ్చిన జగన్ టీడీపీపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు విమర్శించారు.
అయినా, చెల్లికి ఆస్తి ఇచ్చేందుకు జగన్ కండీషన్ పెడతాడా? అని ప్రశ్నించారు. తన మీద, అవినాష్ మీద రాజకీయ విమర్శలు చేయకపోతేనే ఆస్తి ఇస్తానని, ప్రేమాప్యాయతలు ఉంటాయని జగన్ చెప్పడంపై చంద్రబాబు మండిపడ్డారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమందిని రాజకీయంగా ఎదుర్కొన్నానని, కానీ, ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటాడని ఊహించలేదని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేస్తున్న జగన్ తో రాజకీయ పోరాటం చేస్తున్నందుకు సిగ్గుగా ఉందని అన్నారు.
తల్లి మీద కోర్టుకు వెళ్లి… చెల్లిని రోడ్డు మీదికి లాగి…డైవర్షన్ పాలిటిక్స్ అని టీడీపీ మీద పడి ఏడుస్తున్న జగన్ కు చంద్రబాబు చురకలంటించారు. జగన్ కుటుంబ విషయాలతో తమకేం సంబంధం? అని ప్రశ్నించారు. భర్త సంపాదించిన ఆస్తిలో మొదటి హక్కు భార్యకు రాదా? అని జగన్ ను ప్రశ్నించారు.
విలువలు లేని రాజకీయం చేస్తూ హీరోయిజం చూపించాలని జగన్ అనుకుంటున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. జగన్ వంటి వారిని ఆదర్శంగా తీసుకోవద్దని పిల్లలకు చెప్పాలని అన్నారు. గత ఐదేళ్లలో తనను స్వేచ్ఛగా బయట తిరగనివ్వలేదని, కానీ, ఇప్పుడు జగన్ స్వేచ్ఛగా తిరుగుతున్నాడని అన్నారు. జగన్ నిన్ను ఆపాలంటే ఒక నిమిషం పని అని, నాకు రాజకీయాలు తెలియవా? అని ప్రశ్నించారు.