ఒంగోలు మినీ స్టేడియంలో మహానాడు జరగకుండా ఉండేందుకు నిబంధనల సాకు చెప్పి వైసీపీ ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీంతో, గుండ్లపల్లి వద్ద ప్రత్యామ్నాయ స్థలంలో మహానాడును టీడీపీ శ్రేణులు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో జరుపుతున్నాయి. అయితే, మహానాడుకు వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేని ప్రభుత్వం…నానా రకాలుగా సభకు వస్తున్నవారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే జగన్ సర్కార్ కు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
ఈ రోజు సాయంత్రం జరిగే సభకు ఎవరూ రాకుండా బస్సులకు అనుమతివ్వడంలేదని, సాయంత్రం సభకు ఎంతమంది వస్తారో చూడండి అంటూ సభను అడ్డుకోవాలనుకుంటున్నవారిని చంద్రబాబు హెచ్చరించారు. మహానాడు సభకు ఎవరూ రాకుండా ఉండాలని వైసీపీ బస్సు యాత్ర చేపట్టిందని, తమ బస్సులకు అనుమతి ఇవ్వలేదని మండిపడ్డారు. తప్పుడు రాజకీయాలను ప్రజలు ఆమోదించరని జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు.
ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఒంగోలులోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడు అని చంద్రబాబు కొనియాడారు. ఎన్టీఆర్ ముందుచూపున్న నాయకుడని ప్రశంసించారు. తెలుగు ప్రజల పౌరుషం నందమూరి తారక రామారావు అని, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
పేదవారి నాడి తెలిసిన నాయకుడు అని అన్నారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీతో అద్దంకి బస్టాండ్ సెంటర్ కు చేరుకున్న చంద్రబాబు అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేశారు.