‘ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి. ఈ ఎన్నికలు రాష్ట్రాభివృద్ధికి, భవిష్యత్ తరాల అభ్యున్నతికి అత్యంత కీలకమైనవి. మీ భవిష్యత్తును, మీ సంక్షేమాన్ని కాంక్షించే శ్రేయోభిలాషిగా ఈ బహిరంగ లేఖ రాస్తున్నా’ అంటూ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కీలక బహిరంగ లేఖ రాశారు.
2014లో రాష్ట్రం విడిపోయిందని, అనేక కష్టనష్టాలతో నాడు టీడీపీ ప్రభుత్వం ప్రస్థానం మొదలుపెట్టింది. సుపరిపాలనతో రాష్ట్రాన్ని కొద్దికాలంలోనే అభివృద్ధి దిశగా నడిపించాం. 2019లోనూ టీడీపీ గెలిచి ఉంటే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉండేది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
2019లో మోసపూరిత హామీలతో జగన్ అధికారంలోకి వచ్చాడు. అధికారం చేపట్టినప్పటి నుంచే విధ్వంసక, అరాచక పాలనకు తెరతీశాడు. వ్యవస్థలను చెరబట్టి, ప్రశ్నించే ప్రజలను, విపక్షాలను అణచివేశాడు.
ఇప్పుడు వైసీపీ భస్మాసురుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకునే అవకాశం వచ్చింది. మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుని అరాచకాలకు ముగింపు పలకాలి.
సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిక్షణ అనే అజెండాతో ముందుకువచ్చిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థులకు నిండుమనసుతో ఓటేసి గెలిపించాలి అని చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశాడు.
కాగా, రాష్ట్ర దశ, దిశను మార్చే ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడిందని, మే 13వ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉపాధి, ఉద్యోగ అవసరాల నిమిత్తం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.
“ప్రజా చైతన్యం వెల్లివిరియాలి… రాష్ట్ర భవిష్యత్ ను మార్చేందుకు మీ ఓటే కీలకం. మీతో పాటు మరో నలుగురు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా వారిని ప్రోత్సహించండి. మీ భవిష్యత్తును, మీ రాష్ట్ర భవిష్యత్తును మార్చేది మీరు వేసే ఓటే. నిర్భయంగా, నిజాయతీగా, స్వేచ్ఛగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.