రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో మునుపెన్నడూ లేని వినూత్న పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయబోతున్నానని చంద్రబాబు ప్రకటించారు. ఈసారి టిడిపి అభ్యర్థులను సరికొత్త విధానంలో ఎంపిక చేస్తానని చంద్రబాబు చెప్పారు. ఐవీఆర్ఎస్ టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామని, ప్రజా మద్దతు ఉన్నవారిని ఎంపిక చేస్తామని చంద్రబాబు చెప్పారు.
ఈ వినూత్న విధానం ద్వారా అభ్యర్థులు ఎవరు అన్న విషయం తనకు మాత్రమే తెలుస్తుందని, పార్టీలోని మిగతా వ్యక్తులకు తెలియదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ తరఫున అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులలో ఎవరి సిఫారసులు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పారు. టీడీపీ అభ్యర్థుల ఎంపిక ప్రజామోదం అని, వైసీపీ అభ్యర్థుల ఎంపిక తాడేపల్లి ప్యాలెస్ ఆమోదం అని అన్నారు. రాబోయే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు, సైకో సీఎం జగన్ కు మధ్య జరగబోతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మద్యపాన నిషేధం చేయకుండా ఓట్లు అడగబోనని చెప్పిన జగన్ ఈసారి ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని విమర్శించారు. విశ్వసనీయత లేని సంపూర్ణ విఫల ముఖ్యమంత్రిగా జగన్ చరిత్రలో నిలిచిపోయాడని ఎద్దేవా చేశారు. దొంగ ఓట్లతో గెలవాలని దిక్కుమాలిన ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రుషికొండను అడ్డగోలుగా తవ్వి 500 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి పర్యాటకం పేరుతో భవనాలు నిర్మించారిన విమర్శించారు. అంత ఖరీదైన భవనంలో టూరిస్టులు ఉంటే ఎన్ని లక్షలు చెల్లించాలని ప్రశ్నించారు. ఈ ముఖ్యమంత్రికి చట్టాలు వర్తించవని, ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులని జగన్ పై చంద్రబాబు నిప్పులు జరిగారు. పంట నష్టం జరిగి రైతులు కన్నీరు పెడుతుంటే రెడ్ కార్పెట్లపై నడిచి వెళ్లిన ముఖ్యమంత్రిని ఏనాడూ చూడలేదని చురకలంటించారు.