వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సంచలన విమర్శలు చేశారు. మంత్రుల గురించి కావాల్సినంత మ్యాటర్ ఉందని, గ్రౌండ్ తెరిచే ఉందని, ఫుట్ బాల్ ఆడుకోవాలని టీడీపీ నేతలు, కార్యకర్తలను చంద్రబాబు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సుకు హాజరైన సందర్భంగా జగన్, వైసీపీ నేతలపై చంద్రబాబు పదునైన విమర్శలు గుప్పించారు. తనను తిట్టడం, టీడీపీ వాళ్లు ఏమీ చేయలేదని చెప్పడమే ఈ మంత్రుల పని అని, ఒరిజినాలిటీయే లేని వ్యక్తులు వారని దుయ్యబట్టారు.
తన సొంత నియోజకవర్గంలో ఒక పిల్ల కాల్వ తవ్వలేని వాడు ఇరిగేషన్ శాఖా మంత్రి అని చంద్రబాబు చురకలంటించారు. నియోజకవర్గంలో పట్టుమని పది ఇళ్లు కట్టించలేని వాడు హౌసింగ్ శాఖా మంత్రి అని, ఇండస్ట్రీల గురించి అడిగితే కోడిగుడ్డు కథ చెప్పే మంత్రి ఇంకొకరని ఎద్దేవా చేశారు. ఇక, ఏపీకి ఉన్నది ఆర్థికశాఖా మంత్రి కాదని, అప్పుల శాఖా మంత్రి అని బుగ్గనపై పరోక్షంగా పంచ్ లు వేశారు. నిద్రలేచినప్పటి నుంచి ఏది తాకట్టు పెట్టాలనే ఆలోచన తప్ప సంపద క్రియేట్ చేద్దాం అని ఉందని చురకలంటించారు. చివరకు రైతు బజార్లు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిన మంత్రి ఆయన అంటూ గాలి తీశారు.
విద్యార్థుల జీవితాలు నాశనం చేసిన వాడు విద్యా శాఖా మంత్రి అని, ఇటువంటి మంత్రుల గురించి కావాల్సినంత మ్యాటర్ ఉందని, గ్రౌండ్ తెరిచే ఉందని, ఫుట్ బాల్ ఆడుకోవాలని ఐ-టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమరావతి ఎక్కడికీ పోదని, ఏపీ రాజధాని విషయంలో ఆందోళన వద్దని అన్నారు. మరో 9 నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత అమరావతి పనులను పరుగులు పెట్టిస్తామని అన్నారు.అమరావతి పేరు వింటే స్వర్గం, దేవతల రాజధాని గుర్తొస్తుందని, అలాంటి అమరావతిని చెడగొట్టడానికి జగన్ కు ఎలా బుద్ధి పుట్టిందో అర్థం కావడంలేదని దుయ్యబట్టారు.