టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో మునుపన్నడూ లేని విధంగా అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఏపీని గాడిలో పెట్టే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కూటమిలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఈ రోజు భేటీ కానున్నారు.
అంతేకాదు, వారి పనితీరును బట్టి వారికి చంద్రబాబు ప్రోగ్రెస్ కార్డులు జారీ చేయబోతున్నారు. ఈ రోజు సాయంత్రం కూటమి ఎమ్మెల్యేలందరూ…చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ కావాలని కూటమి ఎమ్మెల్యేలకు ఆహ్వానం అందింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్ లో జరగబోయే ఈ సమావేశానికి కూటమిలోని మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు అందరూ హాజరు కాబోతున్నారని తెలుస్తోంది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలానికి ఈ సమావేశానికి ఆహ్వానం అందలేదు.
100 రోజుల కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలను, ఆ ఎమ్మెల్యేల పనితీరును చంద్రబాబు వివరించబోతున్నారని తెలుస్తోంది. పనితీరును బట్టి ఎమ్మెల్యేలకు రిపోర్ట్ కార్డులు కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. విడివిడిగా ఎమ్మెల్యేలకు ఈ ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలని, ఒకవేళ ప్రోగ్రెస్ కార్డులు సిద్ధం కాకపోతే తర్వాత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఇక, కూటమి ప్రభుత్వ భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో దాదాపు మూడు గంటల పాటు సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది అని తెలుస్తుంది. దీంతో, చంద్రబాబు ఏ ఎమ్మెల్యేకు ఎన్ని మార్కులు వేయబోతున్నారు అన్న టెన్షన్ ఎమ్మెల్యేల్లో మొదలైంది.