ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణలో టీడీపీ పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక..ఆ అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆ బైపోల్ బరిలో దిగేందుకు టీడీపీ కూడా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబుతో టీటీడీపీ నేతలు చర్చించారు. ఈ క్రమంలోనే మునుగోడు ఉప ఎన్నికలో పోటీ చేసే వ్యవహారంపై ఈ నెల 13న నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ గౌడ్ చెప్పారు.
తన నివాసంలో మునుగోడు ఉపఎన్నికపై చర్చించేందుకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర రెడ్డి, అరవింద్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కంభంపాటి రామమోహన్‌రావు, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డిలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారికి దిశానిర్దేశం చేశారు. రాబోయే ఎన్నికల రక్షంగా ఇకపై తాను తరచుగా ఎన్టీఆర్ భవనం వస్తానని చంద్రబాబు చెప్పారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై చర్చించారు. బీసీలకు వెన్నుదన్నుగా నిలిచిన టీడీపీ మునుగోడులో బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వాలని పార్టీ నేతలు ప్రతిపాదించారు. మిగిలిన అభ్యర్థులు అగ్రవర్ణాల వారేనని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ క్రమంలోనే ఆ అంశంపై స్థానికంగా మునుగోడు కేడర్ అభిప్రాయాలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఎన్టీఆర్ శత జయంతి, పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవం, వస్తున్నా మీకోసం పాదయాత్ర చేసి పదేళ్లయిన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాల గురించి చంద్రబాబుకు వారు వివరించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను చంద్రబాబుకు అందజేశారు.