అమరావతి రాజధాని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు నేటి నుంచి అమరావతి రైతులు ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరుతో మహా పాదయాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహా పాదయాత్రకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంఘీభావం తెలిపారు. ఇది రాష్ట్ర పరిరక్షణ కోసం రైతులు చేస్తున్న యాత్ర అని, రాజధాని కోసం భూములను త్యాగం చేసిన పుడమి తల్లి వారసులు చేస్తున్న ఉద్యమమని భావోద్వేగానికి గురయ్యారు. అవమానాలెదురైనా ఆశయ సాధన కోసం పోరాడుతుంటామని, అమరావతి ఉద్యమం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రతీకారాలు, కూల్చివేతలపై జగన్ కు ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధిపై లేదని దుయ్యబట్టారు. 3 రాజధానుల పేరుతో రివర్స్ పాలనకు జగన్ తెరలేపారని మండిపడ్డారు. ఏపీలో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని, ఓటర్లంతా ఏకమై వైసీపీని ఓడించి రివర్స్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. వైసీపీని ఓడిస్తేనే ప్రజల ధన-మాన-ప్రాణాలకు రక్షణ ఉంటుందని చెప్పారు.
ఏపీకి రాజధాని ఏదో చెప్పుకోలేని దుస్థితిని జగన్ కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్, గంజాయి విషయంలో ప్రభుత్వం డొల్లతనం బయటపడిందని, గంజాయిపై ప్రశ్నించిన వారిపై కేసులు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా టీడీపీ పోరాడుతోందని అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అని చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి స్టీల్ ప్లాంట్ పై పోరాడాలని డిమాండ్ చేశారు.
అప్పుల కోసం గవర్నర్ సార్వభౌమాధికారాలనూ తాకట్టుపెట్టారని విమర్శించారు. ఉపాధి కూలీలకు నెలల తరబడి వేతనాలివ్వకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. నీరు-చెట్టు, నరేగా బిల్లులు తక్షణమే విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రూ.4 వేల కోట్ల బియ్యం కుంభకోణంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్, సెస్ తగ్గించే వరకు పోరాటం చేస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే.. యథావిధిగా ఎయిడెడ్ స్కూళ్ల వ్యవస్థ ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.