జగన్ పాలనలో వైసీపీ నేతలకు పోలీసులు కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలు చెప్పినట్లు వింటున్న పోలీసులు….టీడీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు, లోకేష్ ఎన్నోసార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల చెప్పుచేతల్లో ఉన్న పోలీసులు తర్వాత మూల్యం చెల్లించుకోక తప్పదని పలుమార్లు హెచ్చరించారు. అయితే, తీరు మారని పోలీసులు మాత్రం యథా రాజా తథా ప్రజ అన్న రీతిలో తమ ధోరణిలోనే కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా పోలీసులు కూడా అధికార పార్టీకి చెందిన నేతల రుబాబుకు బలైన వైనం చర్చనీయాంశమైంది. అనంతపురంలోని గుల్జార్ పేట సెబ్ పోలీస్ స్టేషన్ పై కొందరు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఆ దాడిలో ఓ మహిళా పోలీసు దుస్తులు లాగుతూ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకువచ్చిన వీడియో వైరల్ అయింది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతోపాటు పోలీసులకు కూడా రక్షణ లేని అరాచక పాలన కొనసాగుతోందని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
అక్రమ మద్యం కేసులో పట్టుబడిన వ్యక్తిని వదిలేయాలంటూ ఎస్ఈబీ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి పోలీసులను చితకబాదడం దారుణమని మండిపడ్డారు. అంతేకాకుండా, మహిళా పోలీసు డ్రెస్ లాగుతూ స్టేషన్ బయటకు ఈడ్చుకెళ్లడాన్ని తీవ్రంగా ఖండించారు. పాలకులు, పాలకులకు కొమ్ముకాస్తున్న పోలీసు పెద్దలు ఈ ఘటనను ఎలా సమర్థించుకుంటారని చంద్రబాబు నిలదీశారు. ఈ దాడిలో వైసీపీ రౌడీలతో పాటు వాలంటీర్లు కూడా పాల్గొనడం దారుణం అని మండిపడ్డారు. ఒక నేరగాడికి అధికారం ఇచ్చినందుకు ప్రజలు ఇలాంటి నేరస్తుల పహారాలో భయం భయంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.