టీడీపీ అధినేత చంద్రబాబు.. విజన్-దూరదృష్టి-పట్టుదల-కృషి వంటివి ఆయనను చాలా దగ్గరగాచూసిన అతి తక్కువ మందికి మాత్రమే పరిచయం. పైకి.. ఆయన రాజకీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రే అయినా.. ఆయనలో గొప్ప కార్యనిర్వహణా దక్షుడు.. ముందుచూపున్న మార్గదర్శి ఉన్నారనడంలో సందేహం లేదు. ఇవే ఆయనను రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ స్థాయిలోనూ రాజకీయ నాయకుడిగా నిలబెట్టాయి.
చంద్రబాబు ఎక్కడ ఉన్నా.. ఏం చేస్తున్నా.. నిరంతరం భవిష్యత్తుపై ఒక ధ్యానం.. ఒక అజమాయిషీ.. వంటివి ఉండడంతో చంద్రబాబును సమున్నతంగా నిలబెడుతున్నాయనడంలో సందేహం లేదు.
తాజాగా బాంబే ఐఐటీ విద్యార్థులను ఉద్దేశించి వెబినార్ ద్వారా చంద్రబాబు ప్రసంగించారు. గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్లో పాల్గొన్న చంద్రబాబు.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… అనేక రూపాల్లో విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు. అనేక అంశాలను విద్యార్థులతో పంచుకున్నారు. సంక్షోభ సమయాలలో ఎలా ఎదురొడ్డి నిలవాలో దిశానిర్దేశం చేశారు. తాను ఎలాంటి పరిస్థితి నుంచి ఎలాంటి పరిస్థితికి ఎదిగిందీ చంద్రబాబు వివరించారు. ప్రతి విషయాన్నీ కూలంకషంగా పరిశీలించి.. రాబోయే తరానికి దానిని ఏవిధంగా వినియోగించాలనే విషయంపై దృష్టి పెట్టాలని సూచించారు.
‘‘సంక్షోభాలను ఎదుర్కోవడంలోనే సామర్ధ్యం బయటపడుతుంది. సంక్షోభాలనే అవకాశాలుగా మార్చు కుంటే ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలుస్తారు“- అంటూ ప్రారంభించిన చంద్రబాబు ప్రసంగంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. 1991లో దేశంలో ఆర్ధిక సంస్కరణలు, 1995లో తాను సీఎం కావడం, 1996లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు, ఏపిలో సెకండ్ జనరేషన్ రిఫామ్స్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. తొలిసారి సీఎం కాగానే విజన్ 2020 రూపొందించానని, 20 ఏళ్ల భవిత్యవాన్ని ముందు ఆలోచించడం ద్వారా రాష్ట్రప్రగతికి బీజాలు వేశానని ఆయన వివరించారు.
హైదరాబాద్ లో నిర్మించిన హైటెక్ సిటీ ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తేగా, సైబర్ టవర్స్ ఐటీ అభివృద్దికే నమూనా అయ్యిందని వివరించారు. ఆర్ధికంగా ఉమ్మడి రాష్ట్రాభివృద్దికి దోహదం చేసింది. సియాటెల్ తర్వాత రెండవ బేస్ గా హైదరాబాద్ కు మైక్రోసాఫ్ట్ వచ్చిందని వివరించారు.
హైదరాబాద్ లో అప్పుడు అభివృద్ది చేసిన బయో టెక్నాలజీ పార్క్ ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తయారీలో కూడా ముందంజలో ఉండటం, 8 లేన్ అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, దేశానికే 4% జీడీపీ ఇచ్చే స్థాయికి హైదరాబాద్ చేరేందుకు ఇవన్నీ దోహదపడ్డాయని వివరించారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఆర్ధిక కష్టాలు.. ఉన్నప్పటికీ.. పట్టుదలతో పనిచేసి 10.5% వృద్దిరేటు సాధిం చామన్న చంద్రబాబు.. వరుసగా 4ఏళ్లు రెండంకెల వృద్ది సాధించామని వివరించారు. రూ 15.48లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాబట్టామని.. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం, పట్టుదలగా పనిచేయడం ద్వారానే పురోగతిని సాధించామని వివరించారు.
“గత 30ఏళ్లలో సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రాబోయే 30ఏళ్ల అభివృద్ధి వైపు మనందరి దృష్టి ఉండాలి. 2050 నాటికి ఎలా ఉండాలన్న ఆలోచన చేయాలి. గతంలో ‘‘ప్రి రిఫామ్స్, పోస్ట్ రిఫామ్స్’’ గా అభివృద్ది చరిత్ర రాసినట్లే, ప్రస్తుత పరిస్థితుల్లో ‘‘ప్రీ కోవిడ్, పోస్ట్ కోవిడ్’’ గా అభివృద్ది చరిత్ర తిరగరాసే పరిస్థితులు ఉన్నాయి.“ అని పేర్కొన్నారు.
“మన విజన్ ఎలా ఉండాలి, అది సాధించడానికి నువ్వేం చేయాలి, దేశానికేం ఇవ్వాలి, సమాజానికేం ఇవ్వాలి. అనేదానిపై మన ఆలోచనలు, కార్యాచరణ ఉండాలి. మనం ఏది సాధించాలని అనుకున్నా దానికో విజన్ ఉండాలి. ప్రతి విజయానికి ఒక విజన్ ఉంటుంది. మీ అందరికీ ‘‘మెగా మైండ్ సెట్’’ ఉండాలి. భారతదేశం మెగా సూపర్ పవర్ గా ఎదిగేలా మీరంతా మెగా సూపర్ పవర్ గా ఎదగాలి..
ఇప్పుడు నడుస్తోన్న పారిశ్రామిక విప్లవం 4 దశలో మీ భాగస్వామ్యంపై ఆలోచన చేయాలి. 4వ పారిశ్రామిక విప్లవంలో అనూహ్య మార్పులు వచ్చాయి. మిషన్ టూల్స్, డేటా సెంటర్ వచ్చాయి. వీటి వినియోగం అందిపుచ్చుకోవాలి“ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. మొత్తంగా అనేక విషయాలను ఆయన స్పృంశించినా.. ప్రధానంగా విజన్కే ప్రాధాన్యం ఇవ్వాలని.. వచ్చే 2050 సంవత్సరం లక్ష్యంగా విద్యార్థులు అడుగులు ముందుకు వేయాలని విద్యార్థులకు నూరిపోశారు.