తన 73వ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలోని నెక్కలంగొల్లగూడెంలో నిర్వహించిన గ్రామసభకు అద్భుతమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. గ్రామస్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన చంద్రబాబు..ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంపై పదునైన విమర్శలు గుప్పించారు. పుట్టిన రోజు నాడు సరికొత్త జోష్ తో ఉన్న చంద్రబాబు…వైసీపీని ఎదుర్కొనేందుకు కొత్త పంథాతో ముందుకు వెళ్లబోతున్నానన్న సంకేతాలిచ్చారు.
ప్రజలను పట్టించుకోని వైసీపీని ఉరితీయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పోలవరంలో అవినీతి అని దుష్ర్రచారం చేశారని, చివరకు కొండను తవ్వి ఎలుక తోకపై వెంట్రుక కూడా పట్టుకోలేదని ఎద్దేవా చేశారు. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయి 3 సీజన్లైనా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఇప్పుడు రూ.800 కోట్ల అదనపు భారం మోపారని, పోలవరం కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర మొత్తం పూర్తిగా నష్టపోయిందని, సన్న బియ్యం ఇస్తానంటూ ఉన్న బియ్యం పోగొడుతున్నారని దుయ్యబట్టారు. జగన్ ప్రభుత్వ అవినీతికి అడ్డుపడుతూనే ఉంటామని, అప్పు ఎంత తెచ్చారో జగన్ చెప్పి తీరాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రజల కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చంద్రబాబు మరో మారు స్పష్టం చేశారు.
మరోవైపు, జగన్ పై గ్రామస్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినట్లు తెలుస్తోంది. జగన్ అన్నా క్యాంటీన్లు ఆపేయటంతోనే పేదలకు గుప్పెడన్నం కూడా జగన్ పెట్టలేరని అర్ధమైందంటూ వారు విమర్శించారని తెలుస్తోంది. ఇప్పుడు గుక్కెడు మంచినీళ్ళు కూడా జనానికి పొయ్యనీకుండా చలివేంద్రంలో పార్కింగ్ పెట్టారని, చివరకు జగన్ కు కూడా మంచినీళ్ళు కూడా దొరక్కుండా చేస్తారు ప్రజలు అంటూ దుయ్యబట్టినట్లు తెలుస్తోంది.