సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని టిడిపి నేతలు, కార్యకర్తల ఇళ్లు, కార్యాలయాలపై దాడులు చేయడం వైసీపీ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్న విమర్శలు చంద్రబాబు సహా ప్రతిపక్ష నేతలందరి నుంచి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంసకర పాలన…తాజాగా చిత్తూరు జిల్లా పుంగనూరులోని టిడిపి కార్యాలయం కూల్చివేత, గుంతకల్లులో కుట్టు మిషన్ కేంద్రం తగలబెట్టడం వరకు కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. పుంగనూరులో, గుంతకల్లులో జరిగిన ఘటనలు వైసిపి రాక్షస పాలనకు, రాక్షస రాజకీయానికి నిదర్శనం అని చంద్రబాబు మండిపడ్డారు. పుంగనూరులో టిడిపి కార్యాలయం నిర్వహించుకునేందుకు ఓ భవనాన్ని అద్దెకు ఇచ్చారని, అది అక్రమ నిర్మాణం అంటూ అధికారులు కూల్చివేతకు సిద్ధం అవడం ఏమిటని చంద్రబాబు మండిపడ్డారు.
ఇక, అనంతపురం జిల్లా గుంతకల్లులో మహిళల కుట్టు శిక్షణ కేంద్రానికి నిప్పు పెట్టిన ఘటనపై కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. పుంగనూరులో టిడిపి ఆఫీసు ఖాళీ చేయించేందుకు స్వయంగా ఎస్పీ పోలీస్ బలగాలతో వెళ్లడం ఏమిటని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఐపీఎస్ కు అర్హులేనా అంటూ ఘాటుగా స్పందించారు. గుంతకల్లులో కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని తగలబెడతారా అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
తగలబెట్టడం, కూలగొట్టడం ఇదేనా మీ రాజకీయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి క్షుద్ర రాజకీయం నుంచి వైసిపి ఇంకా బయటకు రాలేదా అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఈ రెండు ఘటనల తాలూకు పేపర్ క్లిప్పింగ్స్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన చంద్రబాబు జగన్ పై విమర్శలు గుప్పించారు.