పల్నాడు జిల్లాలోని మాచర్లలో టీడీపీ నేతలు, టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి ఘటన సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మాచర్ల టీడీపీ నియోజకవర్గ ఇన్ చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగడం, వాహనాలు తగులబెట్టడం, బ్రహ్మారెడ్డి ఇల్లు, ఇంట్లోని టీడీపీ కార్యాయాన్ని దగ్ధం చేయడం కలకలం రేపింది. అయితే, ఈ ఘటనకు పాల్పడిన వారిపై నామ మాత్రపు కేసులు పెట్టిన పోలీసులు.. బ్రహ్మారెడ్డితోపాటు టీడీపీ నేతలపై పలు సెక్షన్లతో బలంగా కేసు బనాయించడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
ఇక, మాచర్లలో జరిగింది ఇరు వర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవ అంటూ పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి చేసిన కామెంట్లు టీడీపీ నేతలకు ఆగ్రహం తెప్పించాయి. ఈ క్రమంలోనే ఎస్పీతో పాటు ఏపీ పోలీసుల తీరు బాగాలేదని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. లాఅండ్ ఆర్డర్‌ను పణంగా పెట్టి వైసీపీకి సహకరిస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పల్నాడు జిల్లా ఎస్పీని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీ స్థానంలో హోంగార్డును కూర్చోబెట్టినా సమర్ధవంతంగా పనిచేస్తారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ పోలీసుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యాఖ్యలను చంద్రబాబు వెనక్కు తీసుకోవాలని, పోలీసులు తమ డ్యూటీ సక్రమంగా చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై టీడీపీ నేత బొండా ఉమ విమర్శలు గుప్పించారు. జిల్లా ఎస్పీలా కాకుండా వైసీపీ జిల్లా అధ్యక్షుడి మాదిరిగా ఆయన వ్యవహరిస్తున్నారని ఉమ షాకింగ్ కామెంట్స్ చేశారు.
వైసీపీ అధికారం కొద్ది రోజులేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పోలీసులకు హితవు పలికారు. టీడీపీ నేతల ఇళ్లు, కార్లను వైసీపీ నేతలు తగులబెడితే వారిపై కేసులు పెట్టకుండా కాపాడుతున్నారని విమర్శించారు. రవిశంకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఎస్పీ ఫ్యాక్షనిస్టు మాదిరి వ్యవహరిస్తున్నారని గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. పోలీసులను డీజీపీ అదుపులో పెట్టుకోవాలని సూచించారు.