ఏపీలో పెండింగ్ లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పోలీసుల అండతో వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని చోట్ల టీడీపీ అభ్యర్థుల చేతిలో నుంచి నామినేషన్ పత్రాలను వైసీపీ కార్యకర్తలు లాక్కొని వెళ్లారని, మరికొన్ని చోట్ల రిటర్నింగ్ అధికారులు కూడా టీడీపీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలు చించివేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే పక్షపాత ధోరణితో వ్యవహరించే రిటర్నింగ్ అధికారులకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చారు.
అయినప్పటికీ, నామినేషన్లకు ఆఖరి రోజైన నేడు రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ నేతల అక్రమాలు యథేచ్ఛగా కొనసాగాయి. చంద్రబాబు సొంత ఇలాకాలో సైతం టీడీపీ అభ్యర్థిపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో జగన్ పై మరోసారి చంద్రబాబు నిప్పులు చెరిగారు. కుప్పంలో 14వ వార్డు టీడీపీ అభ్యర్ధిపై వైసీపీ నేతల దాడిని ఖండించిన చంద్రబాబు….జగన్ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మండిపడ్డారు. ఈ ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు చంద్రబాబు లేఖ రాశారు. వైసీపీ నేతల దాడిపై ఫిర్యాదు చేసి దాడికి సంబంధించిన ఫొటోలను లేఖకు జతచేశారు.
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 14వ వార్డు టీడీపీ ఎస్సీ అభ్యర్థి వెంకటేశ్‌పై వైసీపీ నేతలు దాడి చేయడం కలకలం రేపింది. నామినేషన్ దాఖలు చేసే కేంద్రం వద్దే టీడీపీ అభ్యర్థిపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. ఈ దాడిలో వెంకటేశ్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 30 మంది వరకు వెంకటేశ్ పై దాడి చేసి కొట్టారు. వెంకటేశ్ సెల్‌ఫోన్ లాక్కొని నామినేషన్ పత్రాలు చించేయడంపై చంద్రబాబు మండిపడ్డారు..
హైకోర్టు ఆదేశాల ప్రకారం ముప్పు పొంచి ఉన్న అభ్యర్థులకు భద్రత కల్పించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. తక్షణమే కుప్పం ఉప ఎన్నికల్లో దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, కుప్పం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియమించిన ప్రత్యేక ఎన్నికల అధికారిని తొలగించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్ఈసీ) ను టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ అశోక్ బాబులతో కూడిన టీడీపీ బృందం కోరింది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లని అధికారులే దగ్గరుండి వేయిస్తున్నారని ఆరోపించారు.