రెండో విడత పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని పలు పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ నేతల బెదిరింపులకు ఎదురొడ్డిన టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపు బావుటా ఎగురవేశారు. ఈ క్రమంలోనే కొందరు మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా రెపరెపలాడింది. ఈ క్రమంలోనే ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు….టీడీపీ అభ్యర్థులు, వారి బంధువుల ఇళ్లపై దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
గుంటూరు జిల్లా నర్సరావుపేటలోని ఇస్సాపాలెం గ్రామ శివారులోని శిశుమందిర్ సమీపంలో టీడీపీ నేతల ఇళ్లపై పంచాయతీ అధికారులు దాడులు నిర్వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ మద్దతు అభ్యర్థికి ప్రచారం చేశారనే అక్కసుతో అధికారులే కక్ష సాధింపు చర్యలకు దిగారని, అన్ని అనుమతులతో నిర్మించిన గృహాల మెట్లను ఆకస్మికంగా తొలగించారని బాధితులు వాపోతున్నారు. గోగులపాడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా వైసీపీకి వ్యతిరేకంగా పని చేసినందుకు ఎమ్మెల్యే అనుచర వర్గం కక్ష సాధిస్తోందని ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే తన ఇంటి మెట్లను కూల్చేసేందుకు వచ్చిన జేసీబీకి టీడీపీ కార్యకర్త అడ్డుగా పడుకున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఈ నేపథ్యంలో ఈ ఘటనను టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. ఇలాంటి అటవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని, టీడీపీ బలపరిచిన అభ్యర్థి గెలిచినందుకు వైసీపీ సర్కారు ఈ విధంగా ప్రతీకారం తీర్చుకుందని మండిపడ్డారు. ప్రత్యర్థి గెలిస్తే పగతో ఇలాంటి రాజకీయాలను చేయాలని రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. జేసేబీకి అడ్డుగా పడుకున్న టీడీపీ కార్యకర్త ఫొటోను చంద్రబాబు ట్విట్టర్ లో షేర్ చేస్తూ మండిపడ్డారు.
పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతున్న వైసీపీ నేతలకు సిగ్గురావడం లేదని చంద్రబాబు మండిపడ్డారు. విద్వేషం, విధ్వంసాలతో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. పోలీసుల ఉదాసీనతతో రాష్ట్రంలో వైసీపీ గూండాల దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆరోపించారు. క్రోసూరులో టీడీపీ నేతల అక్రమ అరెస్ట్, పులివెందులలో పంట పొలాలను వైసీపీ నేతలు నాశనం చేయడంపై చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.
ఆవులవారిపాలెంలో అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పులివెందులలో పంట పొలాలను నాశనం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ఆగడాలపై, దౌర్జన్యాలపై, మూడో విడత ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే.