తమ పాలనలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చివేస్తామని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని సీఎం జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. నాడు-నేడు, అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలు మునుపెన్నడూ లేవని, వాటిని తమ ప్రభుత్వమే చేపట్టిందని గొప్పలు చెప్పుకుంటున్నారు. అయితే, జగన్ చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండడం లేదని విమర్శలు వస్తున్నాయి. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిన జగన్…జీవో నెంబర్ 77తో పేద విద్యార్థులకు అన్యాయం చేశారని విమర్శలు వస్తున్నాయి. పీజీ చేస్తున్న విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్లను ఎత్తేస్తూ ప్రత్యేకంగా జీవో నంబర్ 77ను తీసుకురావడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘం నాయకులు నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు. జీవో నెంబర్ 77 పేద విద్యార్థులపాలిట శాపంగా మారుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
జీవో నెం.77జీవోను జగన్ తక్షణమే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. జీవో నెం.77 రద్దు కోసం ఆందోళన చేసినవారిని అరస్టు చేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. జీవో నెంబర్ 77పై ప్రశ్నించిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, విద్యార్థులపై వేధింపులు, అరెస్టులను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఎన్నికలకు ముందు జగన్ కేజీ టూ పీజీ ఉచిత విద్య అంటూ గప్పాలు కొట్టారని…ఈ రోజు పీజీ విద్యార్ధులకు స్కాలర్ షిప్, రీయింబర్స్ మెంట్ రద్దు చేశారని దుయ్యబట్టారు. జగన్ కు ప్రచార ఆర్భాటం మాత్రమే ఉందని, విద్యార్థులకు మేలు చేయాలన్న ఆలోచన లేదని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్ధులకు ఉన్నత విద్యను జగన్ దూరం చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ పథకాలకు పేర్లు మార్చి జగన్ తన పథకాలుగా హడావుడి చేస్తున్నారని విమర్శించారు. జీవో 77ను తక్షణమే ఉపసంహరించుకొని, విద్యార్ధులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.