ఏపీలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరడంపై దేశపు అత్యున్నత ధర్మాసనం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో నేడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. సవాళ్లను అధిగమించే రీతిలో రాజ్యాంగం రచించారని, ఇది జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమో పోలీసు రాజ్యమో కాదని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఏపీలో పోలీసులు ఇండియన్ పీనల్ కోడ్ కాకుండా రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పౌరుల స్వేచ్ఛకు భంగం కలిగించేవారికి పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. నల్ల చట్టాలు, ఫోన్ ట్యాపింగ్ లకు పోలీసులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ పరిధిలోనే అధికారులు, ఉద్యోగులు పనిచేయాలని చంద్రబాబు అన్నారు.
ఎన్నికల నిర్వహణకు సహకరించబోమంటూ ఏపీ ఉద్యోగుల సంఘం చేసిన ప్రకటనలపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగుల తీరుపై సుప్రీం కోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన స్వయంప్రతిపత్తి కలిగిన ఈసీకి సహకరించబోమని ఉద్యోగులు బెదిరించడం రాజ్యాంగ ఉల్లంఘనేనన్న టాక్ వస్తోంది. ఉద్యోగులకు తోడుగా పోలీసులు కూడా ఎన్నికల విధులకు వెళ్లబోమనేలా వ్యాఖ్యానించడంపై విమర్శలు వచ్చాయి. ఈ రోజు సీఎంగా జగన్ అధికారంలో ఉండొచ్చు….ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ ఉండొచ్చు…వారిద్దరికీ మధ్య వివాదం వచ్చి ఉండొచ్చు…కానీ, ఉద్యోగులు మాత్రం సర్వీసు ఉన్నంతకాలం మరెంతోమంది ఎస్ఈసీలను, ప్రభుత్వాలను చూడాల్సి ఉంటుంది. కాబట్టి, రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటేనే ఉద్యోగులు గౌరవం…హుందాతనం శాశ్వతంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు సుప్రీం కోర్టు ఉద్యోగులకు రాజ్యాంగ బద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలివ్వడం విశేషం. ఇకనైనా, ఉద్యోగులు…రాజ్యాంగబద్ధులై ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.