పేరుకు అధినేతలే కానీ.. నిస్సారమైన ప్రసంగాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వారిలో చంద్రబాబు ఒకరు. నిజానికి గడిచిన ఇరవై ఏళ్లలో ఆయన ప్రసంగాల తీరు చాలానే మారిందని చెప్పాలి. తొలి నాళ్లలో సీఎం పదవిని చేజిక్కించుకున్న వేళ.. మైకు పట్టుకుంటే చాలు.. వణికేవారు. అంత దారుణమైన రీతిలో ఆయన స్పీచ్ ఉండేది. ఏళ్లకు ఏళ్లు కష్టపడి బాబు సాధించింది ఏమైనా ఉందా? అంటే.. అది తన ప్రసంగాన్ని కాస్తంతైనా పదును పెట్టేలా మార్చుకోవటమే.
టీఆర్ఎస్ అధినేత మాదిరి ఆయన మాటల్లో పంచ్ లు చాలా తక్కువ. తెచ్చి పెట్టుకున్న ఆవేశంతో ఆయన మాటలు ఉంటాయన్న విమర్శ కూడా ఉంది. ఇదే.. ప్రజలతో ఆయన్ను కనెక్టు కాకుండా చేస్తుందన్న విమర్శ ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా మాత్రం తన ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేసే ఒక పంచ్ వేశారని చెప్పాలి. ఈ విషయంలో బాబును కాస్తంతైనా అభినందించాల్సిందే.
తాజాగా మంగళగిరిలో నిర్వహించిన సాధన దీక్ష కార్యక్రమంలో మాట్లాడిన చంద్రబాబు.. తన ప్రసంగంలో కోవాగ్జిన్ ప్రస్తావన తీసుకొచ్చారు. తన సామాజిక వర్గానికి చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ దేశీయ టీకాకు కులం రంగు పూస్తారా? అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో తన ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు.
దేశం గర్వపడేలా వ్యాక్సిన్ తీసుకొచ్చిన భారత్ బయోటెక్ కు జగన్ రెడ్డి.. కులం బురద పూశారన్న బాబు.. ఇదెక్కడి నాగరికత? అని ప్రశ్నించారు. భారీగా టీకాలు వేసామని చెప్పుకోవటమే కానీ..ఒక్క వ్యాక్సిన్ అయినా కొన్నారా? అని ప్రశ్నించారు. ‘ఇదేంటని ప్రశ్నిస్తే.. వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే కంపెనీ మీ బంధువులదీ అంటూ నాపై నెపం నెట్టారు.
మరి జగన్ రెడ్డి బంధువులు.. సహ నిందితుల కంపెనీలు ఇంజెక్షన్లు తయారు చేశాయి కదా? వారు ఎందుకు ఇవ్వలేదు? రెమిడెసివర్ ఉత్పత్తి చేసే కంపెనీ ఆయన సహ నిందితుడిదే కదా?’’ అంటూ ఘాటుగా రియాక్టు అయ్యారు. రెమిడెసివిర్ ప్రస్తావన తీసుకురావటం ద్వారా.. సెకండ్ వేవ్ వేళ.. ఆ ఇంజెక్షన్ కోసం ఎంతలా తిరిగారో తన ఒక్క ఉదాహరణతో గుర్తు చేయటమే కాదు.. తన మాటలతో ఉక్కిరిబిక్కిరి చేశారన్న మాట వినిపిస్తోంది.