ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీ రహిత ఎన్నికలైనప్పటికీ….గెలుపు కోసం అధికార పార్టీ చేస్తున్న హడావిడి చర్చనీయాంశమైంది. కుదిరితే రాజీ…కుదరకపోతే బెదిరింపు…ఇలా బలవంతపు ఏకగ్రీవాలకు వైసీపీ తెరతీసిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ నాయకులు పిరికిపందలు కాబట్టే బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని టీడీపీ….ధ్వంసం చేయాలని వైసీపీ చూస్తోందని మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం జగన్ రెడ్డికి ఇష్టం లేదని, అందుకే వైసీపీ నేతలను రెచ్చగొట్టి..టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అలజడులు రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేయడం, రాష్ట్రాన్ని దగా చేయడం తప్ప జగన్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జగన్ రాబట్టింది గుండుసున్నా అని, పోలవరం, అమరావతికి నిధులు లేవని విమర్శించారు.
నేరాలు-ఘోరాలు చేసి వాటిని ఎదుటివారిపై రుద్దడం జగన్ దుష్టబుద్ధి అని, ఆయన బాబాయి వివేకానందరెడ్డి హత్య గుండెపోటుగా చిత్రించి టీడీపీపై ఆరోపణలు చేయడం ఇందుకు నిదర్శనమని అన్నారు. ఆ కేసులో ప్రతిపక్ష నేతగా సీబీఐ విచారణ కోరిన జగన్.. సీఎం అయ్యాక వద్దని లేఖ ఎందుకు రాశారని ప్రశ్నించారు. బాబాయి హత్యకేసులో నిందితులను కాపాడటం వెనుక మర్మం ఏమిటని, సీఎం అయిన తర్వాత నిందితుల కొమ్ముకాయడం జగన్ నైజం అని మండిపడ్డారు. అవినీతిని ప్రశ్నించిన పట్టాభిపై హత్యాయత్నం చేశారని, నిమ్మాడలో అచ్చెన్నాయుడిని ఎందుకు అరెస్ట్ చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. విశాఖ వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు రాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ..? వైసీపీ ఉన్మాదులతో కుమ్మక్కై రూల్ ఆఫ్ లా భగ్నం చేసే పోలీసులను, అధికారులను గుర్తు పెట్టుకుంటామని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.