ఈ రోజు పీలేరు, ఉరవకొండలో జరిగిన ‘‘రా కదలిరా’’ బహిరంగ సభలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని, ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం ఆసన్నమైందని చంద్రబాబు అన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో టీడీపీ-జనసేన కూటమే విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయని ‘సిద్ధం’ అంటూ జగన్ ప్రజలలోకి వస్తున్నాడని, లేదంటే పరదాల మాటున, ప్యాలెస్ లోనే ఉండే వారని ఎద్దేవా చేశారు. ఇలాంటి జలగ మనకు వద్దని, వై నాట్ పులివెందుల అని కార్యకర్తలలో ఉత్సాహం నింపారు.
తనది సీమ రక్తం అని, సీమను రతనాల సీమగా మార్చేందుకు తాను చేసిన ప్రయత్నాలకు జగన్ గండి కొట్టాడని చంద్రబాబు మండిపడ్డారు. షర్మిలతో జగన్ గొడవలు వారి వ్యక్తిగతమని, జగన్-షర్మిల కొట్టుకుంటే దానికి తాను బాధ్యుడిని ఎలా అవుతానని చంద్రబాబు ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్ లో చేరినా, ఆమెకు ఏపీ పీసీసీ పదవి ఇచ్చినా తనదే బాధ్యత అన్నట్టు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరూ తన స్టార్ క్యాంపెయినర్లేనని చంద్రబాబు అన్నారు. సీఎంకు బుద్ధి లేదని, ఆలుగడ్డకు ఉల్లిగడ్డకు తేడా తెలియని ముఖ్యమంత్రి మనకొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.
జాబు రావాలంటే బాబు రావాలని, బాబు రావాలంటే యువత సైకిల్ ఎక్కి టీడీపీ-జనసేన కూటమి గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి ప్రపంచంలోనే తెలుగుజాతిని నెంబర్ వన్ గా నిలబెడతానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.