సీఎం జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. విజయనగరం పర్యటనకు వెళుతూ మార్గమధ్యంలో శ్రీకాకుళం జిల్లా పొందూరులో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు…జగన్ పాలనపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశాడని, జగన్ చేతుల్లో ఏపీని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అధికారం శాశ్వతం కాదని జగన్ కు హితవు పలికారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా, ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా వైసీపీ ఇంటికి వెళ్లాల్సిందేనని జోస్యం చెప్పారు.
ఉత్తరాంధ్ర మీద జగన్ ది సవతి తల్లి ప్రేమ అని చురకలంటించారు. మూడున్నరేళ్లలో జగన్ చేసి అభివృద్ధి ఏమీ లేదని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర ప్రజలపై జగన్ కు అభిమానం లేదని, ఈ ప్రాంతంలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేయలేదని అన్నారు. కనీసం, ఒక ఇండస్ట్రీ తెచ్చాడా? ఒక కాలేజీ తెచ్చాడా? అని నిలదీశారు. ఈ రోడ్ షోకు వచ్చిన ప్రజల ఆవేశం, తనపై చూపుతున్న ప్రేమాభిమానాలు చూస్తుంటే రాత్రికి పొందూరులోనే ఉండిపోవాలనిపిస్తోందని చంద్రబాబు అన్నారు.
పొందూరు ఖద్దరు ఎంతో ఫేమస్ అని, తాను ఎమ్మెల్యే అయినన్నప్పటినుంచి పొందూరు ఖద్దరు గురించి వింటున్నానని చంద్రబాబు తెలిపారు. చేనేత కార్మికులకు ఎప్పుడూ టీడీపీ అండగా ఉంటుందన్నారు. “జాబు రావాలంటే… బాబు రావాలి, రైతుల ఆత్మహ్యతలు ఆగాలంటే… బాబు రావాలి, రాష్ట్రం బాగుపడాలంటే… బాబు రావాలి” అని ప్రజలతో చంద్రబాబు నినాదాలు చేయించారు. ఆ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అయితే, నినాదాలు బాగానే చెబుతున్నారు తమ్ముళ్లూ… యాక్షన్ లోనే కనిపించడంలేదు అంటూ చిరు అసంతృప్తిని చంద్రబాబు వ్యక్తం చేశారు.
ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కేసులకు భయపడేదే లేదని అన్నారు. అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారు… ఏం పీకారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.