జగన్ హయాంలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ ఆడియో టేపు దుమారం..వంటి అంశాలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ మసకబారుస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
ఇక, లడ్డూ ప్రసాద విక్రయం వివాదం, టికెట్ కౌంటర్ల, తొక్కిసలాటలు వంటి వ్యవహారాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వం నడుచుకుంటోందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తిరుమల ప్రతిష్టకు భంగం కలిగేలా వైసీపీ నేతలు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అయింది. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన ఉన్న గోడలపై హిందూ దేవతల బొమ్మల స్థానంలో వైసీపీ రంగులు ఉండడం హాట్ టాపిక్ గా మారింది.
నాడు-నేడు అంటూ నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక ఫొటో వైరల్ అవుతోంది. గతంలో చంద్రబాబు హయాంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ రోడ్డు పక్కన ఉన్న గోడలపై హిందూ దేవుళ్లు, దేవతల పెయింటింగ్స్ ఉండేవి. తిరుమల పవిత్రతకు అద్దం పట్టేలా ఆ చిత్రాలుండేవి. అయితే, ఎప్పుడు జరిగిందో తెలీదుగానీ…హఠాత్తుగా ఆ దేవతలు, దేవుళ్ల పెయింటింగ్స్ స్థానంలో వైసీపీ రంగులు వచ్చి చేరాయి. దీంతో, నాడు-నేడు అంటూ జగన్ ను నెటిజన్లు దుయ్యబడుతున్నారు.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. హిందూ దేవతల స్థానంలో వైసీపీ రంగులు ఉండడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని చంద్రబాబు అన్నారు. హిందూ మతాన్ని అవమానించాలన్న లక్ష్యంతో ఈ చర్యలకు పాల్పడడంపై భక్తులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఆ ఫొటోను చంద్రబాబు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేయడంతో అది మరింత వైరల్ అయింది.