రాష్ట్రంలో విద్యా వ్యవస్థ రూపురేఖలు సమూలంగా మార్చివేస్తున్నామని వైసీపీ నేతలు గొప్పలు చెబుతున్న సంగతి తెలిసిందే. నాడు-నేడు అనే కార్యక్రమంతో పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలల దశ దిశ మారతాయని జగన్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అయితే, రాష్ట్ర యువత భవిష్యత్తులో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న ఉన్నత విద్యాసంస్థలను మాత్రం జగన్ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. యూనివర్సిటీ వీసీలుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించడంలో జగన్ నిమగ్నమయ్యారని, కానీ, యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా ఏమాత్రం అడుగులు వేయలేదని విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యంలోనే కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులలో ఏపీ అట్టడుగు స్థానంలో నిలవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 2019లో ఆంధ్రా యూనివర్సిటీ 29వ స్థానంలో ఉందని, 2023లో ఆ ర్యాంకు 76కు దిగజారిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రతిష్టాత్మక ఎస్వీ యూనివర్సిటీ ర్యాంక్ కూడా దిగజారిందని, కనీసం టాప్ 100లో చోటు దక్కించుకోలేకపోయిందని చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
టాప్ 100 పరిశోధక విద్యా సంస్థలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సంస్థ కూడా లేకపోవడం శోచనీయమని అన్నారు. విద్యారంగానికి కేటాయించిన నిధులు వైసీపీ ఖజానాలోకి దారిమళ్లడమే ఇందుకు కారణమఅని చంద్రబాబు దుయ్యబట్టారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలోని పలు యూనివర్సిటీల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు గుర్తు చేశారుజ అంతేకాదు, రాష్ట్రంలోని యూనివర్సిటీలు, పలు విద్యాసంస్థలు వైసీపీ రాజకీయ కార్యకలాపాలకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వేదికలుగా మారాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ఇంకా ఎంత బ్రష్టు పట్టిపోయాయో అంచనా వేయాల్సి ఉందని చంద్రబాబు జగన్ కు చురకలంటించారు. ఇక, ఇదే సమయంలో తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ ఓవరాల్ ర్యాంకులో 64వ స్థానంలో ఉండగా, దేశంలోని టాప్ 100 యూనివర్సిటీలలో 36 స్థానంలో నిలిచింది.