సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాజధాని అమరావతిపై జగన్ విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా దిగ్విజయంగా జరుగుతున్న అమరావతి రైతుల మహా పాదయాత్రను భగ్నం చేసేందుకు విశాఖ గర్జన పేరుతో వైసీపీ నేతలు నానా యాగి చేసినందుకు రెడీ అవుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా అమరావతి వ్యవహారంలో జగన్ తీరుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఎండగట్టారు.
గతంలో విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని ఉండాలని, విభేదాలు వద్దని చెప్పిన జగన్ సీఎం అయిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతి అంటే నీకెందుకు అంత కంపరం అంటూ అంటూ మండిపడ్డారు. కొత్తగా వచ్చిన ప్రతి ముఖ్యమంత్రి రాజధాని మార్చుతాను అంటే కుదురుతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిని నిర్ణయించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉందని హైకోర్టు చెప్పినా జగన్ వితండవాదం చేస్తున్నారని మండిపడ్డారు.
మూడు రాజధానుల పేరుతో వైసిపి నేతలు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖపై ప్రేమ ఉన్న జగన్ అక్కడ అభివృద్ధి ఏం చేశాడని ప్రశ్నించారు. ఎన్నో ప్రముఖ కంపెనీలు విశాఖ నుంచి వెళ్లిపోయాయని, అదంతా జగన్ చలవేనని మండిపడ్డారు. రుషికొండ తవ్వకాలపై, నిర్మాణాలపై హైకోర్టు వ్యాఖ్యలను అందరూ చూశారని, విదేశీయులు సైతం గుర్తుపట్టే రుషికొండను నేడు బోడిగుండు చేశాడని మండిపడ్డారు.
ఏపీకి రెండు కళ్లవంటి అమరావతి, పోలవరంలను జగన్ నిర్వీర్యం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని గ్రాఫిక్స్ అంటున్నారని మరి హైదరాబాద్ కూడా గ్రాఫిక్సేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రివర్స్ పాలనలో రాష్ట్రం రివర్స్ గేర్ లో వెళుతోందని అన్నారు. టిడిపి లీగల్ సెల్ కొత్త కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.