టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడి అరెస్టుపై టిడిపి అధినేత చంద్రబాబు మండిపడుతున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఒక్క అవకాశం అంటూ కాళ్ళావేళ్ళా పడడంతో ప్రజలు వైసీపీని గెలిపించారనిచ కానీ సీఎం అయిన తర్వాత జగన్ రాక్షస పాలన సాగిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలుస్తానని జగన్ చెబుతున్నారని, కానీ రాబోయే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని చంద్రబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.
అంతేకాదు, ఎన్నికల తర్వాత పులివెందులలో జగన్ ఓటమిపాలై జైలుకెళ్లడం ఖాయమని, వైసిపి బంగాళాఖాతంలో కలవడం ఖాయమని చంద్రబాబు జోస్యం చెప్పారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రెక్కీ నిర్వహించడం, హత్యా ప్రయత్నానికి సుపారీ తీసుకోవడం ఆరోపణలపై కూడా చంద్రబాబు ఫైర్ అయ్యారు. పవన్ ను బ్రతకనివ్వరా..ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తారా అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని మండిపడ్డారు.
ఇక, జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల కూడా వివేకా కేసులో సిబిఐకి స్టేట్మెంట్ ఇవ్వడంపై చంద్రబాబు స్పందించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి వివేకా హత్యకేసుతో సంబంధం ఉందన్న కోణంలో షర్మిల వాంగ్మూలం ఇచ్చారన్న ప్రచారంపై జగన్ ఏం చెబుతారని చంద్రబాబు నాయుడు నిలదీశారు. కడప ఎంపీ సీటు విషయంలోనే వైయస్ ఫ్యామిలీ రెండుగా విడిపోయిందని షర్మిల చెప్పారని చంద్రబాబు అన్నారు. షర్మిల చేసిన ఆరోపణలపై జగన్ ఏం సమాధానాలు ఇస్తారని చంద్రబాబు ప్రశ్నించారు.