జగన్ సీఎం అయిన తర్వాత పాఠశాల రూపు రేఖలు మార్చేస్తున్నామంటూ వైసీపీ నేతలు గప్పాలు కొడుతోన్న సంగతి తెలిసిందే. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్నారు. నాడు-నేడు అంటూ ఫొటోలు పెట్టి మరీ విపరీతమైన ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న రీతిలో…వైసీపీ నేతలు చెబుతున్నదానికి, చేతలకు అస్సలు పొంతన ఉండడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల ప్రాథమికోన్నత పాఠశాలలో పైకప్పు పెచ్చులు రాలి చిన్నారులకు గాయాలైన ఘటన అందుకు నిదర్శనంగా నిలిచింది. పైకప్పు పెచ్చులు ఊడిన ఘటనలో చిన్నారుల తలలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. చిన్నారులకు గాయాలు కావడం బాధాకరమని, నాడు-నేడు అని ప్రచారం చేసుకోవడం తప్ప ఈ ప్రభుత్వం పాఠశాలల పునరుద్ధరణ కోసం ఏమీ చేయడంలేదని మండిపడ్డారు.
తరగతి గదుల స్థితిపై తల్లిదండ్రులు హెచ్చరించినా పట్టించుకోలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. చదువుకోవడానికి వచ్చిన చిన్నారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, అసమర్థత వల్ల రక్తం చిందించాల్సి వచ్చిందని, ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
ఇకపై అయినా పాఠశాలల్లో మౌలిక వసతుల పట్ల ప్రభుత్వం శ్రద్ధ చూపాలని చంద్రబాబు హితవు పలికారు. పత్రికలో ఒక ఫుల్ పేజీ ప్రకటనకు ఇచ్చే డబ్బుతో పాఠశాలల్లో ఎన్నో పనులు చేయవచ్చని జగన్ ప్రచార ఆర్భాటాలనుద్దేశించి చురకలంటించారు. బాధిత చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలికి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు, వంగలపూడి అనితలు అందజేశారు. ఘటన జరిగిన రోజే బాధిత మహిళను ఆసుపత్రిలోనే పరామర్శించిన చంద్రబాబు…బాధిత మహిళకు అండగా ఉంటామని ప్రకటించారు. అదే రోజు ఆమెకు రూ.5 లక్షల సాయాన్ని ప్రకటించారు. తాజాగా ఈ సాయాన్నే బోండా ఉమ, అనితలు బాధిత మహిళ కుటుంబానికి అందజేశారు.