కర్నూలు జిల్లాలో టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు పర్యటన అప్రతిహతంగా కొనసాగుతోంది. నిన్న ఓర్వకలలో చంద్రబాబు రోడ్ షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నేడు ఆదోనిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబును చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తనకోసం వచ్చిన ప్రజలు, టిడిపి కార్యకర్తలను ఉద్దేశించి చంద్రబాబు భావోద్వేగంతో ప్రసంగించారు.
తానేమి సినిమా యాక్టర్ ను కాదని, తన సినిమా సూపర్ హిట్టు కాలేదని, కానీ కట్టలు తెంచుకున్న జన ప్రవాహం చూస్తుంటే మళ్ళీ టిడిపి రావాలి అని ప్రజలంతా సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్టుగా అనిపిస్తోందని చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం పై, జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి జగన్ రెడ్డి ఒక శని గ్రహంలో మారాడని, అన్ని ఆపేసి అభివృద్ధి నిలిపివేశాడని చంద్రబాబు విమర్శించారు.
ఆనాడు జగన్ ముద్దులు చూసి మోసపోయి ఓట్లు వేశామని జనం ఇప్పుడు బాధపడుతున్నారని చంద్రబాబు అన్నారు. మూడున్నరేళ్ల జగన్ పాలనలో అభివృద్ధి ఆగిపోయి రౌడీయిజం పెరిగిపోయిందని దోపిడీలు నేరాలు పెరిగిపోయారని చంద్రబాబు ఆరోపించారు. రౌతు కొద్ది గుర్రం అని అందుకే పోలీసులు కూడా ఇలా తయారయ్యారని విమర్శించారు. ప్రజలు తిరగబడి మీ అంతు చూస్తే అది తన బాధ్యత కాదని పోలీసులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.
చెత్తపై పన్నువేసిన చెత్త ముఖ్యమంత్రి మరుగుదొడ్లపై కూడా పన్నులు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక దొరకడం లేదని స్థానిక ఎమ్మెల్యే సాయంత్రానికి డబ్బులు లెక్కపెట్టుకుంటున్నారని విమర్శించారు. మద్యం మాఫియా తో జగన్ దోపిడీకి తెర తీశారని, తయారీ, అమ్మకం అంతా ఆయనదేనని ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లాలో హవాలా మంత్రి కర్నూల్ లో బెంజి మంత్రి ఇలా జగన్ క్యాబినెట్ ఉందంటూ చురకలు అంటించారు.
పవన్ విశాఖకు వెళ్తే ఇబ్బంది పెట్టారని, ఇప్పటంలో బస్సు కూడా రాని ఊరికి 120 అడుగుల రోడ్డు వేస్తామంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నేతల ఇళ్లపై రోడ్లు వేయలేమా, ఫ్లైఓవర్ కట్టలేమా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే టీవీ చానల్స్ ను ఉన్మాది జగన్ రెడ్డి అడ్డుకుంటున్నాడని, తాను ఆరోజు అలా చేసి ఉంటే సాక్షి టీవీ, సాక్షి పేపర్ వచ్చేదా అని చంద్రబాబు నిలదీశారు.
తాను రైతు కూలీల పిల్లలను ఐటి ఉద్యోగులను చేశానని, జగన్ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చి సరిపెట్టాడని అన్నారు. నా అనుభవం అంత లేదు ఈ ముఖ్యమంత్రి వయసు అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. తాను వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఏ చేశానని, జగన్ ఎక్కడ చదువుకున్నాడో చెప్పాలని చంద్రబాబు నిలదీశారు.
Thank you #Adoni pic.twitter.com/jHiV7vXPOd
— N Chandrababu Naidu (@ncbn) November 17, 2022