వైసీపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్‌పైనా తరచుగా విమర్శలు గుప్పించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. తాజాగా ఇంట్రస్టింగ్ కామెంట్లు చేశారు. వైసీపీ ప్రభుత్వం.. సీఎం జగన్.. గత నాలుగేళ్లుగా ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసి ఉంటే.. ఇప్పుడు తాను యుద్ధభేరి యాత్రను చేపట్టేవాడినా? అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను కట్టకుండా.. కాంట్రాక్టర్లను బెదిరించడం.. గతంలో తాము ఆమోదం తెలిపిన ప్రాజెక్టులను కూడా ఆపేయడం వల్లే.. యుద్దభేరి చేపట్టామని చెప్పారు.
సాగునీటి రంగంలో ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు వస్తున్నాయని చంద్రబాబు అన్నారు. సీమ పర్యటనను ముగించుకుని.. నెల్లూరుకు వచ్చిన చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రవహిస్తున్న కీలకమైన 5 నదులను అనుసంధానం చేస్తే రాష్ట్రానికి నీటి కష్టాలు ఉండవని చెప్పారు. సోమశిల, కండలేరు ప్రాజెక్టుల పనులకు బిల్లులు చెల్లించక పనులు ఆపేశారని విమర్శించారు.
నెల్లూరుకు కీలకమైన గండిపాలెం కాలువల నిర్వహణ గాలికి వదిలేశారని, పెద్దిరెడ్డి సాగర్ పనులకు బిల్లులు కూడా ఇవ్వలేదని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు గంగ ప్రాజెక్టుపై మాట్లాడుతూ.. రాష్ట్ర నీటి అవసరాలు తీర్చిన తరువాతే చెన్నైకి నీరిస్తమని ఆనాడు ఎన్టీఆర్ తేల్చి చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. రాయలసీమ నాలుగు జిల్లాలు, నెల్లూరు జిల్లా ప్రాజక్టులు పూర్తి చేసింది టీడీపీనేనని తెలిపారు.
మేం కట్టిన ప్రాజెక్టు పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ ఎత్తిపోతల ద్వారా రాయలసీమ నెల్లూరుకు నీళ్లు అందించామని చెప్పారు. కానీ, అప్పట్లో పట్టిసీమ ప్రాజెక్టును కూడా వైసీపీ నాయకులు అడ్డుకున్నారని.. అయినా.. పట్టుదలతో పని పూర్తి చేశామని చెప్పారు.