ఏపీలో పెంచిన విద్యుత్ చార్జీలపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క కరెంటు కోతలు, మరో పక్క విద్యుత్ చార్జీల వాతలతో వేసవి కాలంలో జనాన్ని నానా తిప్పలు పెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ఇంటిపన్నులు.. చెత్త పన్నులు.. ఇపుడు ఏడోసారి కరెంటు ఛార్జీలు భారీగా పెంచేశారంటూ టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో విద్యుత్ కోతలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందని, తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు విలవిలలాడిపోతున్నారని బాధపడ్డారు. విద్యుత్ సరఫరా లేక ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు పడుతున్న బాధలకు జగన్ ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. నాడు మిగులు విద్యుత్ తో వెలుగులు నిండిన మన రాష్ట్రంలో ఇప్పుడు కరెంట్ ఎందుకు పోతోందని నిలదీశారు.
రాష్ట్రంలో నేటి చీకట్లకు కారణం ఎవరంటూ జగన్ అసమర్థ పాలనను చంద్రబాబు దుయ్యబట్టారు. భారీగా పెరిగిన బిల్లులను ప్రజలు కిమ్మనకుండా కడుతున్నా ఈ కోతలు ఎందుకని జగన్ ను నిలదీశారు చంద్రబాబు. గ్రామాల్లో ప్రజలు కరెంట్ లేక నానా తిప్పలు పడుతూ రోడ్లెక్కుతుంటే…మరో పక్క వలంటీర్లకు సన్మానం అంటూ రూ.233 కోట్లను తగలేస్తున్న జగన్ ను ఏమనాలని ప్రశ్నించారు.
రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించారని, అదే తరహాలో కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడుతుంటే వలంటీర్లకు సన్మానం అంటూ పండుగ చేసుకుంటున్న ఈ ముఖ్యమంత్రిని నీరో అనక ఇంకేమనాలి? అని ప్రశ్నించారు. విద్యుత్ కోతలను ప్రశ్నించిన సామాన్య ప్రజలపై బెదిరింపులు మాని సమస్యను పరిష్కరించే దిశగా జగన్ ఆలోచన చేయాలని చంద్రబాబు హితవు పలికారు.