టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏపీ సీఎం జగన్ను ఓ ఆట ఆడించేశారు. తాజాగా తిరుపతి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్.. పొటాటో అంటే.. ఉల్లిపాయలే కదా! అంటూ.. చేసిన వ్యాఖ్యపై సర్వత్రా విస్మయం ఎదురైన విషయం తెలిసిందే. నెటిజన్ల నుంచి అనేక మంది రాజకీయ నాయకుల వరకు కూడా.. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాజాగా టీడీపీ అధినేత కూడా.. జగన్పై విరుచుకుపడ్డారు. నీ ‘దుంప’ దెగ మా కొంపలు కూల్చేస్తున్నావు నువ్వు..ఏమీ తెలియకుండా..అంటూ జగన్ పై చంద్రబాబు సెటైర్లు వేశారు.
“పొటాటోకు-ఆనియన్కు తేడా తెలీని ముఖ్యమంత్రి.. మనకు అవసరమా? .. ఈయన రైతులను ఉద్ధరిస్తాడట. వచ్చే ఎన్నికల్లో రైతులు తిరగబడాలి. ఈ పొటాటో ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలి“ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరు సభలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మురికి కాలువలో మురికి తీయాలన్న బుద్ధి జ్ఞానం ప్రభుత్వానికి ఉండాలని, రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని అసమర్ధ ప్రభుత్వమని అన్నారు.
మిచౌంగ్ తుఫాన్ కారణంగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు రైతులంతా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా హృదయ విదారకంగా ఉందని, రైతులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి అహంకారానికి రైతులు బలైపోయారని అన్నారు. “ముఖ్యమంత్రికి ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియదు. నిన్న ఒక్కరోజే నలుగురు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు“ అని వ్యాఖ్యానించారు.
గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూడా కాపాడలేని ముఖ్యమంత్రి దద్దమ్మ ఉపన్యాసాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. “పులిచింతల గేట్లు కొట్టుకుపోయాయి ఎవరు కారణం…?. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది ఎవరు కారణం అని అడుగుతున్నా. గేట్లు రిపేరు చేయలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడంట” అని చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.