జగన్ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, పోలీస్ వ్యవస్థను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, జగన్‌ది తుగ్లక్ పాలన కాక మరేమిటని చంద్రబాబు మండిపడ్డారు.నెల్లూరు కార్పొరేషన్ ఎన్నిక స్కృటినీలో అధికార పార్టీ దౌర్జన్యానికి దిగడంపై మండిపడ్డారు. 10, 14 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులపై ముష్టి ఘాతాలకు పాల్పడ్డారని, ఆర్వో సమక్షంలోనే దాడి చేశారని మండిపడ్డారు.
మరోవైపు, విశాఖ జిల్లా విద్యుత్ శాఖ లైన్ మెన్ బంగార్రాజు హత్యపై డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ప్రశాంతతకు మారుపేరైన విశాఖలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, అక్రమ భూకబ్జాలు, హత్యలతో క్రైమ్ క్యాపిటల్‌గా మారిపోయిందని లేఖలో పేర్కొన్నారు. మంత్రి బొత్స మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమై నాలుగు రోజులైనా ఇంకా పోస్ట్‌మార్టం నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హంతకులపై కఠిన చర్యలు తీసుకోవడంలో పోలీసుల జాప్యం విశాఖపట్నం శాంతిభద్రతలకు ప్రమాదమని అన్నారు.
మరోవైపు, జగన్ సీఎం అయిన తర్వాత ఏపీలో నిత్యావసర సరుకులు మొదలు పెట్రో ధరల వరు అన్నీ ఆకాశాన్నంటుతున్నాయని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక, ఈ మధ్య పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో పెట్రో, డీజిల్ రేట్లు తగ్గినా…ఏపీలో మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు స్పందించారు. మిగతా రాష్ట్రాలు పెట్రో ధరలు తగ్గించినా…ఏపీలోనే పెట్రో ధరలు తగ్గించకపోవడం ఏమిటని చంద్రబాబు మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా జగన్ పెట్రో ధరలపై ఆందోళన చేశారని, ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. అధికారం ఉందని ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్నారని, పెట్రో ధరల ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని గుర్తు చేశారు. ఓ పక్క విధ్వంసం.. మరో వైపు ప్రజలపై భారం.. ఇదే జగన్ పాలన అని దుయ్యబట్టారు.