ఏపీలో గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అందిస్తోందని వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, 300 కంటే ఎక్కువ రీడింగు వచ్చిందని, ఇలా రకరకాల కుంటి సాకులు చెబుతూ ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన చాలా మందికి పెన్షన్లు కట్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఓ దివ్యాంగురాలికి పెన్షన్ తొలగించడంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
విభిన్న ప్రతిభావంతురాలైన పర్వీన్ అనే అమ్మాయికి పెన్షన్ తొలగించడానికి జగన్ కు మనసెలా వచ్చిందని చంద్రబాబు నిప్పులు చెరిగారు. బాధితులతో కలిసి సెల్ఫీ దిగిన చంద్రబాబు…జగన్ కు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 18 ఏళ్లు వచ్చినా తల్లిదండ్రుల చేతుల మీద పెరుగుతున్న ఆ విభిన్న ప్రతిభావంతురాలు పెన్షన్ తొలగిస్తారా అంటూ మండిపడ్డారు. 300 యూనిట్ల విద్యుత్ వాడకం ఉందని పెన్షన్ కట్ చేయడమే సంక్షేమమా అని ప్రశ్నించారు. పెన్షన్ కు నాడు అర్హురాలు నేడు అనర్హురాలు ఎట్లా అయింది అని నిలదీశారు.
90% వైకల్యం ఉన్న ఆ దివ్యాంగ యువతకు పెన్షన్ తొలగించడమే మానవత్వమా అంటూ ప్రశ్నించారు. వైకల్యంతో బాధపడుతోంది ఆమె కాదని మీరు మీ ప్రభుత్వం అని జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చంద్రబాబు పర్యటన సందర్భంగా పర్వీన్ పెన్షన్ తొలగించారంటూ ఆమె కుటుంబ సభ్యులు చంద్రబాబు దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆమెకు గతంలో టీడీపీ హయాంలో 1500 రూపాయల పెన్షన్ అందించేవారని, తాజాగా ఆమెకు పెన్షన్ తొలగించాలని తెలుసుకొని చంద్రబాబు చలించిపోయారు.
తొలగించిన పెన్షన్ మొత్తం 36 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి తన పెద్దమనసును చంద్రబాబు చాటుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పర్వీన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.