మంగళగిరిలో ఈ రోజు జరిగిన టీడీపీ లీగల్ సెల్ రాష్ట్ర స్థాయి సదస్సులో టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వంలో అన్ని రంగాలు దివాలా తీశాయని, కానీ, కోర్టులు మాత్రం కళకళలాడుతున్నాయని చంద్రబాబు అన్నారు. జగన్ అండ్ కో చేసే అరాచకాల వల్లే ప్రజలు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.
కొద్దిరోజులు పోయిన తర్వాత అడ్వకేట్లకు డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని, ఇటువంటి విధ్వంసకరమైన సీఎంను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. భవిష్యత్తును అంధకారం చేసే పనిలో జగన్ ఉన్నారని దుయ్యబట్టారు. 1978లో ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచి ఇప్పటివరకు వచ్చిన ముఖ్యమంత్రులలో ఇంత నీచమైన రాజకీయాలు చేసిన సీఎం జగన్ ఒక్కడేనని ఎద్దేవా చేశారు.
ఇక, టీడీపీలో అడ్వకేట్లకు పెద్దపీట వేశామని, గతంలో 47 మంది అడ్వకేట్లున్నారని గుర్తు చేసుకున్నారు. యనమల రామకృష్ణుడు, దివంగత నేత బాలయోగి, దివంగత నేత ఎర్రన్నాయుడు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు వంటి అడ్వకేట్లు టిడిపికి విధేయులుగా పనిచేశారని, చేస్తున్నారని కొనియాడారు. టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా పనిచేసిన సీనియర్ అడ్వకేట్ కనకమేడల రవీంద్ర కుమార్ ప్రస్తుతం రాజ్యసభకు వెళ్లారని గుర్తు చేశారు.