జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా తాగా దాదాపు 26 మంది మృతి చెందిన ఘటనపై టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ పాలనలో కల్తీ మద్యం ఏరులై పారడంతోనే వారంతా చనిపోయారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జంగారెడ్డిగూడెంలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు అక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా జగన్ ను చంద్రబాబు ఏకిపారేశారు.
మద్యనిషేధం అంటూ హామీ ఇచ్చిన జగన్…దానిని గాలికొదిలేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రంలో మద్యం, నాటు సారా, కల్తీ మద్యం ఏరులై పారుతోందని, వైసీపీ నేతలే కల్తీ సారా అమ్ముతున్నారని ఆయన దుయ్యబట్టారు. అంతేకాదు, పక్క రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, ఏపీలో మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అన్నీ జగనే చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఆడబిడ్డల తాళిబొట్లు తెంచేసిన వ్యక్తి జగన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబును కలవొద్దని, కలిస్తే పెన్షన్ నిలిపివేస్తామని తమను బెదిరించారని బాధిత మహిళలు చంద్రబాబు వద్ద కన్నీరుమున్నీరయ్యారు. దీంతో, బాధిత మహిళలను వైసీపీ నేతలు బెదిరించడంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. వివేకా గొడ్డలి పోటును గుండెపోటు అని జగన్ చెప్పారని, సిగ్గులేకుండా కల్తీ సారా మరణాలను సహజ మరణాలని జగన్ అంటున్నారని దుయ్యబట్టారు. సొంత మద్యం బ్రాండ్లు తీసుకురావడమే జగన్ మద్యపాన నిషేధమా? అని ప్రశ్నించారు. మద్యం రేట్లు పెంచి కల్తీ, నాసిరకం, నాటు సారా తాగి చనిపోయే వాళ్ల సంఖ్యను జగన్ పెంచారని మండిపడ్డారు.
వైసీపీ నేతల అవినీతి అనకొండ అంత ఉంటుందని, అందుకే వైన్ షాపుల్లో ఆన్ లైన్ బిల్లింగ్ లేదని ఎద్దేవా చేశారు. మృతులకు ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున టీడీపీ ఆర్థికసాయం అందించనుందని, మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇవి ప్రభుత్వం చేసిన హత్యలేనని, పరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.