ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలు వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతోన్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో ఆంధ్రప్రదేశ్ లోని లంక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కచ్చితంగా ప్రభుత్వానిదే. అధికారులు, ప్రజా ప్రతినిధులు సత్వరం స్పందించకుంటే ఎన్నో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ, ఇటువంటి విపత్కర పరిస్థితులలోనూ ఏపీలోని జగన్ సర్కార్ మొద్దు నిద్రపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శలు గుప్పించారు.
వర్షాలు, వరదలతో లంక గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే జగన్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లుందని చంద్రబాబు దుయ్యబట్టారు. గోదావరికి వరదలొచ్చి 6 జిల్లాల్లోని 42 మండలాల పరిధిలో 525కి పైగా గ్రామాల్లో ప్రజా జీవనం స్తంభించిందని, కొన్ని వేలాది మంది నిరాశ్రయులయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం, ఇటువంటి విపత్తుల సమయంలో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందాల్సిన ముందస్తు సూచనలు, హెచ్చరికలు కూడా అందలేదంటే పరిస్థితి ఏమిటో అర్థమవుతోందని అన్నారు. తగిన సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టాన్ని తగ్గించగలమని, ఈ ప్రభుత్వం అది కూడా చేయడం లేదని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో పిడుగులు ఎప్పుడు, ఎక్కడ పడతాయో ముందుగానే తెలియజేసే టెక్నాలజీని తమ ప్రభుత్వం ప్రజలకు అందించిందని, వరదలపై ప్రజల మొబైల్ ఫోన్ లకు రియల్ టైమ్ లో వరద సమాచారం పంపే టెక్నాలజీని కూడా తామే తెచ్చామని చెప్పారు. ప్రకృతి విపత్తులలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని వరద ముంపు గ్రామాల్లో మోహరించి ప్రజలకు తక్షణ సాయం అందించే వారిమని తెలిపారు. కానీ, జగన్ పాలనలో రాష్ట్రంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, ఆ వ్యవస్థలను జగన్ పూర్తిగా నాశనం చేశారని విమర్శించారు. పాలకుల అలసత్వంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే, ఈ విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు, నాయకులు అండగా ఉండాలని, సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల డిమాండ్లపై రాజకీయ విమర్శలు చేయకుండా వరద బాధితులను ప్రభుత్వం ఆదుకునే చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కోరారు.