ఏపీలో విద్యుత్ చార్జీల పెంపు వ్యవహారం రాజకీయ దుమారానికి తెరలేపింది. జగన్ సీఎం అయిన తర్వాత ఆరు సార్లు విద్యుత్ చార్జీల పెంచి జనం నెత్తిన పిడుగు వేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. జగన్ అసమర్ధ పాలనకు విద్యుత్ ఛార్జీల పెంపే నిదర్శనమని, జగన్ ది తుగ్లక్ పాలన అని ఎద్దేవా చేస్తున్నారు. జగనన్న హయాంలో స్విచ్ వేయకుండానే షాక్ కొడుతోందని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో విద్యుత్ చార్జీల పెంపుపై టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు స్పందించారు.
గజదొంగలు సైతం విస్తుపోయేలా ప్రజలను జగన్ దోచుకుంటున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని ప్రమాణ స్వీకారం నాడు ప్రకటించిన జగన్ ఈ మూడేళ్లలోనే రూ.42 వేల కోట్లకు పైగా ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. ఈ విద్యుత్ చార్జీలు చూసి ఏ కంపెనీ కూడా ఏపీకి రాదని, దాని వల్ల నిరుద్యోగం పెరుగుతుందని హెచ్చరించారు. పెట్రో ధరల పెంపు, ఆస్తి పన్ను, చెత్త పన్ను, మద్యం ధరలు, సిమెంట్ ధరల పెంపుతో మధ్య తరగతి ప్రజలు అల్లాడుతున్నారని, అయినా సరే విద్యుత్ చార్జీలు పెంచుతున్నాడని దుయ్యబట్టారు.
జనంపై పన్నులు విధిస్తూ జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నాడని మండిపడ్డారు. సంపన్న వర్గాల కోసమే జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో విద్యుత్ కోతలు లేకుండా, నాణ్యమైన కరెంటు అందించామని గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఎద్దేవా చేశారు. ఏడు పర్యాయాలు కరెంట్ చార్జీలు పెంచారని, విద్యుత్ వినియోగం అంటేనే ప్రజలు హడలిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకమైన విద్యుత్ అంశాన్ని తన సొంత అజెండాతో జగన్ నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు.