వైఎస్ కీర్తి ప్రతిష్టలను చెరిపేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైఎస్ షర్మిళపై, సునీతపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు, పవన్, బీజేపీల కుట్రలో తన చెల్లెళ్లు భాగమయ్యారని విమర్శించారు. చంద్రబాబు, పవన్ లతో కలిసి పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్లి వారి స్క్రిప్ట్ మేరకు పనిచేసే వీళ్ళు వైఎస్ వారసులా అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు మండిపడ్డారు.
తోడబుట్టిన చెల్లెలు పుట్టుకపై కూడా జగన్ మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మహాలక్ష్మి గా భావించే ఇంటి ఆడబిడ్డ చీర పై కూడా విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రి అంటూ దుయ్యబట్టారు. ఇది చాలా నీచం, ఇది జగన్ మనస్తత్వం అని విమర్శించారు.
కాగా, చంద్రబాబుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తోపాటు బీజేపీ జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, జాయింట్ సెక్రటరీ శివ ప్రకాశ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మధుకర్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వీరు సమావేశమై టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు, మే మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్న సంగతి తెలిసిందే. మోదీ రాష్ట్ర పర్యటన, బహిరంగ సభల ఏర్పాటు గురించి కూడా వీరు చర్చ జరిపారు.