సాధారణంగా సీఎం అధికారిక నివాసానికి రెండు, మూడు కిలోమీటర్ల పరిధి వరకు పోలీసులు గస్తీ తిరుగుతుంటారు. ముఖ్యమంత్రి వంటి వీఐపీ నివసించే ప్రాంతం చుట్టూ భద్రతా బలగాలు ఎప్పటికపుడు అప్రమత్తంగా ఉంటూ అనుమానితులను ఆరా తీస్తుంటాయి. ఇక, రాత్రి సమయాల్లో అయితే ఈ పరిధిలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా చేపడుతుంటారు. తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం పరిధిలోనూ ఈ తరహా భద్రతా ఏర్పాట్లుంటాయి.
కానీ, ఇంత భద్రతను కూడా ఛేదించుకొని సీఎం జగన్ ఇంటికి కూతవేటు దూరంలో గతంలో ఓ యువతిపై అత్యాచారం జరిగిన ఘటన పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. కాబోయే భర్త కాళ్లు, చేతులు కట్టేసి అతడి కళ్లముందే యువతిపై ఇద్దరు దుండగులు అత్యాచారానికి పాల్పడిన వైనం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని సీతానగరంలోని కృష్ణా నది పుష్కరఘాట్లో జరిగిన ఈ రేప్ ఘటన జగన్ నివాసం దగ్గర భద్రతకు సవాల్ విసిరింది.
మెడపై బ్లేడు పెట్టి బెదిరించి యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన వైనం సంచలనం రేపింది. దీంతో, అప్పట్లో ఆ ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అయినా సరే, జగన్ నివాసం దగ్గర భద్రత మెరుగుపడలేదు. తాజాగా తాడేపల్లిలో ఓ అంధ బాలిక లైంగిక వేధింపులకు గురై దారుణ హత్యకు గురికావడం సంచలనం రేపుతోంది. బాలికపై రాజు అనే రౌడీ షీటర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వస్తున్నాయి.
ఆ వేధింపుల విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పడంతో ఆమెను పాశవికంగా హత్య చేసినట్లు తెలుస్తోంది. బాలిక మెడపై కత్తితో విచక్షణారహితంగా నరకడంతో తీవ్రంగా గాయపడిన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఈ క్రమంలోనే ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. తాడేపల్లిలో సీఎం నివాసానికి కూతవేటు దూరంలో బాలిక హత్య షాక్ కు గురిచేసిందని అన్నారు.
అంధ బాలికను వేధించి దారుణంగా హతమార్చడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. సీఎం నివాస ప్రాంతంలో రౌడీషీటర్లు, గంజాయి బ్లేడ్ బ్యాచ్ ల స్వైరవిహారం రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దుస్థితికి నిదర్శనమని చంద్రబాబు దుయ్యబట్టారు.