న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో బహిరంగ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభలో టీడీపీ నేతలు పాల్గొనడానికి వీల్లేదని పోలీసులు అడ్డుచెప్పినా…టీడీపీ అధినేత చంద్రబాబు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. జై అమరావతి… జై జై అమరావతి అంటూ ప్రసంగం ప్రారంభించిన చంద్రబాబు..పాదయాత్ర చేసిన రైతులపై అక్రమ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఎన్నికలకు ముందు జగన్ అసెంబ్లీలో ఏం చెప్పారని నిలదీశారు. అమరావతినే రాజధానిగా పెట్టాలని జగన్ చెప్పలేదా? అని ప్రశ్నించారు. కనీసం 30 వేల ఎకరాలున్న రాజధాని ఉండాలని ఆనాడు చెప్పలేదా? అని నిలదీశారు. అమరావతిపై మాట తప్పారా లేదా, మడమ తిప్పారా లేదా? అని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిపై జగన్ కుల ముద్ర వేశారని, ఈ రోజు సభకు వచ్చిన వివిధ పార్టీల నేతలంతా ఏ కులం వారని నిలదీశారు.
అమరావతి 5 కోట్ల మంది ప్రజా రాజధాని …ఇది ఏ ఒక్కరిదో, జగన్ రెడ్డిదో కాదు అని స్పష్టం చేశారు. అటువంటి రాజధాని మూడు ముక్కలాట ఆడతారా? అని మండిపడ్డారు. అమరావతి ముంపు ప్రాంతం అన్నారని, ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మునిగిపోయిందా? అని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారని,… చివరికి హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా అదేం లేదని క్లారిటీ ఇచ్చాయని గుర్తు చేశారు. ఎన్ని కేసులు పెట్టుకున్నా… తాము ధర్మపోరాటం చేస్తున్నామని, ఇందులో గెలిచేది అమరావతి ప్రజలేనని వెంకన్న సాక్షిగా అన్నారు.
హైదరాబాద్ లాగే అమరావతిని అభివృద్ధి చేయాలనుకున్నానని, రాష్ట్రంలో అందరికీ మధ్యలో ఉండే ప్రదేశం అమరావతి అని అన్నారు. జగన్ ఇంట్లో కూర్చున్నా సరే అమరావతిని చెడగొట్టకుండా, ధ్వంసం చేయకుండా ఉంటే అది అద్భుతరీతిలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలని, రాజధాని మాత్రం అమరావతి మాత్రమే ఉండాలని చంద్రబాబు అన్నారు.